
రగులుతున్న రాజయ్యపేట
గంగపుత్రుల గొంతు నొక్కేశారు.. తమ ఆవేదన వెలిబుచ్చే అవకాశాన్ని కాలరాశారు.. బల్క్‌డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనకు సిద్ధపడ్డ మత్స్యకారులను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి నిరాకరించడమే కాక.. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడానికి ఎండలో టెంటు వేసుకుంటామన్నా ఒప్పుకోలేదు. దీంతో మండుటెండలో ఏడు గంటలపాటు మత్స్యకారులు ధర్నా చేశారు.
● బల్క్‌డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా
నిరాహార దీక్షకు సిద్ధపడ్డ మత్స్యకారులు
● అనుమతి నిరాకరించిన పోలీసులు
● భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు సమావేశమైనా ఆటంకాలు
● టెంట్లపై వాహనాలు నిలపడంతో
పోలీసులతో వాగ్వాదం
● మండుటెండలో నిరసనకు
దిగిన గంగపుత్రులు
● ఏడు గంటలపాటు
బైఠాయించిన బాధితులు
నక్కపల్లి: రాజయ్యపేటలో మళ్లీ నిరసన సెగ రగిలింది. ఈ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న బల్క్‌డ్రగ్ పార్క్‌ను నిలిపివేయాలంటూ తాము చేపట్టిన శాంతియుత నిరాహారదీక్షను పోలీసులు అడ్డుకోవడంతో మత్స్యకారులు మండిపడ్డారు. కనీసం తమకు ఆవేదన వెలిబుచ్చే హక్కు కూడా లేదా అని ఆగ్రహంతో ఊగిపోయారు. తమ గ్రామంలో భారీ మెజారిటీ ఇచ్చినందుకు ఇదేనా బహుమానం అని కోపంతో నిలదీశారు. రాజయ్యపేట సమీపంలో బల్క్‌డ్రగ్ పార్క్ నిర్మిస్తే మత్స్య సంపద నశిస్తుందని, ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ మత్స్యకారులు ఆదివారం నిరాహారదీక్షను తలపెట్టారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు టెంట్లపై తమ జీపులను నిలబెట్టడంతో గంగపుత్రులు తీవ్ర మనస్తాపం చెందారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను నమ్మించి మోసం చేశారంటూ హోం మంత్రి వంగలపూడి అనితపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసులకు భయపడేది లేదని, నిరాహారదీక్షలు చేసి తీరుతామంటూ దీక్ష చేసే ప్రాంతం వద్ద ఏడు గంటలపాటు తీవ్రమైన ఎండలో ఆందోళన కొనసాగించారు. మున్ముందు మరింత ఉధృతంగా పోరాడేందుకు సిద్ధపడుతున్నారు.
మత్స్యసంపదకు ముప్పు కలిగించొద్దు
ప్రభుత్వం రాజయ్యపేట సమీపంలో 2 వేల ఎకరాల్లో రూ.1800 కోట్ల వ్యయంతో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో బల్క్‌డ్రగ్ పార్క్ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన పనులు మూడు నెలల నుంచి చురుగ్గా జరుగుతున్నాయి. అయితే ఈ బల్క్‌డ్రగ్ పార్క్ వల్ల మత్స్యకారులు, సమీప ప్రాంతాలత్లో నివసించేవారి ప్రాణాలకు మప్పు వాటిల్లుతుందని, సముద్రంలోకి వేసే పైపులైన్ల వల్ల మత్స్య సంపద నాశనమవుతుందని, జీవనోపాధి కోల్పోయి మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సి వస్తుందని రాజయ్యపేట, బోయపాడు, దొండవాక తదితర గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ర్యాలీలు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా తమ పనులు కొనసాగిస్తోంది. హోం మంత్రి అనితను కూడా మత్స్యకారులు కలిసి సమస్యను వివరించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో మత్స్యకారులు పనులు చేసే చోట శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తామని, అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆదివారం గ్రామస్తులంతా ఊరి చివరన సముద్రపు ఒడ్డుకు సమీపంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు సమావేశమయ్యారు. ఎండగా ఉందని టెంట్లు వేసే సమయంలో నక్కపల్లి, ఎస్.రాయవరం సీఐలు కుమారస్వామి, రామకృష్ణ,, ఎస్‌ఐలు సన్నిబాబు, అంజుల ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. టెంట్లపై పోలీసు జీపులను ఉంచి టెంట్లు వేయకుండా అడ్డుకున్నారు. దీంతో మత్స్యకారులు, మహిళలు ఆగ్రహంతో ఊగిపోయారు. మండుటెండలో తాటి కమ్మలు చేతపట్టి, ఎండ తగలకుండా ఆందోళన కొనసాగించారు. పనులు అడ్డుకోవడం, దీక్ష చేపట్టకుండానే పోలీసులు తమను బెదిరించడం, టెంట్లపై జీపులు పెట్టడం సరికాదని మత్స్యకార నాయకుడు ఎరిపిల్లి నాగేశు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే బల్క్‌డ్రగ్ పార్క్ రద్దు చేయాల్సిందేనన్నారు. విషయం తెలుసుకున్న సీపీఎం నాయకుడు ఎం.అప్పలరాజు తదితరు లు సంఘటన స్థలానికి చేరుకొని మత్స్యకారులకు సంఘీభావం తెలిపారు. పోలీసుల వైఖరి సరికాదన్నారు. టెంట్లు వేయకుండా పోలీసులను అడ్డుకున్నట్టు తెలుసుకుని వందలాది మంది మహిళలు వచ్చి ఆందోళనలో
పాల్గొన్నారు.
రాజయ్యపేటను అమ్మేశావా అనితమ్మా..
ధర్నా చేసిన
మత్స్యకారులపై కేసులు
బల్క్‌డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ ఆదివారం రాజయ్యపేటలో నిరాహార దీక్షకు ప్రయత్నించిన 13మంది మత్స్యకారులపై నక్కపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ మత్స్యకారులు ధర్నా కొనసాగించారు. ప్రభుత్వ అధికారుల ఆదేశాలు ఉల్లంఘించి ధర్నా చేసినందుకు ఎరిపిల్లి నాగేశ్వరరావు, మైలపల్లి మహేష్, మైలపల్లి బైరాగి, గోసల స్వామి, కోడ కాశీరావు, పిక్కి రాము, మైలిపల్లి సూరిబాబు, మైలిపల్లి జాను, మైలపల్లి రాజు, పిక్కి కోదండరాజు, చోడిపల్లి కాశీ, పిక్కి సత్తియ్య, మేడిబోయిన అప్పలరాజులతోపాటు మరికొంతమందిపై కేసులు నమోదు చేసినట్టు సీఐ కుమారస్వామి తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు, మహిళలు హోం మంత్రి వంగలపూడి అనితపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చిన అనిత ఇప్పుడు కనిపించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని కంపెనీల కోసం అమ్మేశారంటూ ఆరోపించారు. ఇంటింటికీ తిరిగి మీ ఆడపడుచును అంటూ ఓట్లు వేయించుకుని తీరా గెలిచిన తర్వాత ముఖం చాటేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిత అండదండలతోనే పోలీసులు తమ దీక్షలను అడ్డుకుంటున్నారన్నారు. ఇంతకంటే దారుణం ఎక్కడా ఉండదన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఆందోళన సాయంత్రం ఐదుగంటల వరకు కొనసాగింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా దీక్ష చేసి తీరుతామని మత్స్యకారులు చెబుతున్నారు. గ్రామస్తులంతా ఏకమై పోరాడుతున్న ఈ సమస్యపై ఒక నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సమావేశంపై పోలీసులు ఆంక్షలు విధించడం సమంజసం కాదని సీపీఎం నాయకులు అప్పలరాజు అన్నారు. ఈ ఆందోళనలో మత్స్యకార నాయకులు ఎం.సూరిబాబు, పిక్కి సత్తియ్య, ఎం.మహేష్‌బాబు, సోమేశ్వరరావు, డి.నానాజీ, నరేష్, మాధవ్, కె.కాశీ, పి.నల్ల, సిహెచ్ వసంతమ్మ, రామ్‌చరణ్ పలువురు మహిళలు పాల్గొన్నారు.

రగులుతున్న రాజయ్యపేట