
‘ప్రగాఢ’ అవిశ్వాసం
ఎమ్మెల్యే వర్గీయులపై ప్రగడ నాగేశ్వరరావు కారాలు, మిరియాలు
అచ్యుతాపురం రూరల్: యలమంచిలి రాజకీయాలు రోజురోజుకు రసకందాయంలో పడుతున్నాయి. నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జినైన తనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌పై, ఆయనతో సన్నిహితంగా ఉంటున్న టీడీపీలోని వైరి వర్గంపై రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు కారాలు, మిరియాలు నూరుతున్నారు. దుప్పితూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రగడ ఆదివారం పరిశీలించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం వచ్చిన కాంక్రీట్ లారీని దుప్పితూరు గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ కుమారుడు ప్రగడ జూనియర్ నాగేశ్వరరావు అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో గతంలో నిర్మించిన రోడ్డు శిథిలావస్థకు చేరుకోవడంతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. రహదారి నిర్మాణాన్ని ఎమ్మెల్యే అండదండలతో దురుద్దేశంతో అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో లేనిపోని విభేదాలు సృష్టించవద్దని నాయకులకు హితవు పలికారు.
ఫ్లైఓవర్ నిర్మాణంలో
లోపించిన నాణ్యతా ప్రమాణాలు
ఫ్లైఓవర్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు లోపించాయని రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. అచ్యుతాపురంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణం పనుల్లో ఆర్ అండ్ బి ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి అవగాహనలేని కాంట్రాక్ట్ లేబర్‌ను పెట్టి పనులు చేయిస్తున్నారన్నారు. దీంతో ప్రమాదాలు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ రహదారులు లేక ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురతున్నారని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి, అధికారుల పర్యవేక్షణలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.

‘ప్రగాఢ’ అవిశ్వాసం