
కంటి మీదకునుకు లేదు
నక్కపల్లి: రాజయ్యపేటలో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బల్క్‌డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గ్రామానికి చెందిన మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోకి ఎందుకొచ్చారంటూ నిలదీశారు. మత్స్యకారుల ఆందోళనకు నాయకత్వం వహించిన ఎరిపిల్లి నాగేశ్వరరావు (నాగేశు)కు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లినట్లు ఆందోళనకారులు తెలిపారు. నోటీసులు తీసుకోడానికి నిరాకరించామని, నోటీసు తీసుకున్నా తీసుకోకపోయినా అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించినట్లు నాగేశు తెలిపాడు. నాగేశును అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న వందలాది మంది మహిళలు, గ్రామస్తులు పోలీసులను చుట్టుముట్టారు. ఉదయం ఆందోళన చేసిన ప్రాంతంలోనే మహిళలంతా ఆందోళన కొనసాగిస్తున్నారు. నాగేశు అరెస్టును అడ్డుకుంటామంటూ మహిళలు ముక్తకంఠంతో చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో అధిక సంఖ్యలో పోలీసులు గ్రామంలోకి రావడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల రాకను నిరసిస్తూ గ్రామంలో రాత్రి 11 గంటలు దాటాక కూడా పిక్కి నూకరాజు, కారే వెంకటేష్, అర్జల్లి మాధవ, పిక్కి కాశీ, మైలపరి సూరిబాబు తదితరులతోపాటు వందలాది మంది మహిళ లు ఆందోళన కొనసాగిస్తున్నారు. నాగేశును పోలీసులు తీసుకెళ్లకుండా కాపలా ఉన్నారు.
అర్ధరాత్రి మోహరించిన పోలీసులు
మత్స్యకార నేత నాగేశు
అరెస్టుకు యత్నాలు
అడ్డుకున్న మహిళలు..
గ్రామంలో ఉద్రిక్తత
కొనసాగుతున్న ఆందోళన

కంటి మీదకునుకు లేదు