
గోవాడ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఆదుకోవాలి
చోడవరం : గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ అఖిల పక్ష రైతు సంఘాలు, కార్మిక సంఘాలు గురువారం ధర్నా నిర్వహించాయి. ఈ ఏడాది క్రషింగ్‌కు సంబంధించి ఇంకా ఎటువంటి ఆదేశాలు, ఫ్యాక్టరీ మిషనరీ ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టకపోవడంతో క్రషింగ్ జరుగుతుందా..లేదా అనే ఆందోళనలో రైతులంతా ఉన్నారు. దీంతో కొద్ది రోజులుగా అఖిలపక్ష రైతు సంఘాలు, కార్మిక సంఘాలు కలిసి పలుమార్లు ఆందోళనలు చేశాయి. అయినా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో మళ్లీ రైతుసంఘాలు, కార్మికులు ప్రత్యక్ష ఆందోళనకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా గురువారం ఫ్యాక్టరీ గేటు వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.50కోట్లు విడుదల చేసి చెరకు రైతులకు పాత బకాయిలు చెల్లించాలని, ఈ ఏడాది క్రషింగ్ సీజన్‌కు కావలసిన యంత్రాల ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కూటమి నాయకులు ఎంపీ, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీని ఆధునికీకరించాలని, ఈనెల 30వ తేదీలోగా నిర్వహించాల్సిన ఫ్యాక్టరీ మహాజనసభను సకాలంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని రక్షించుకునేందుకు అవసరమైతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా రైతుసంఘాలు, కార్మిక సంఘాలు తీర్మానించాయి. ఈ ఆందోళనలో ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, కార్మికసంఘం నాయకుడు శరగడం రామునాయుడు, రైతు సంఘాల ప్రతినిధులు దండుపాటి తాతారావు, తనకల జగన్, ఏడువాక శ్రీనివాసరావు పాల్గొన్నారు.