
మోదీ నేతృత్వంలో దేశాభివృద్ధి
అనకాపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ అన్నారు. ఎన్టీఆర్ క్రీడా మైదానం నుంచి రింగ్‌రోడ్డు పెంటకోట కన్వెన్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అధ్యక్షతన గురువారం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ జీఎస్టీలో సంస్కరణల వల్ల ఈనెల 22 నుంచి పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయని చెప్పారు. కూటమి పాలనలో పార్టీ శ్రేణుల్లో కొంత మేరకు అసంతృప్తి ఉన్న విషయం పార్టీ దృష్టికి వచ్చిందని, స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనకాపల్లి–రాజమహేంద్రవరం ఆరు లైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు త్వరలో శ్రీకారం చుడతారన్నారు. ఈనెల 14న విశాఖ రైల్వే క్రీడా మైదానంలో బీజేపీ రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు.
వివిధ వర్గాల వారితో చాయ్ పే చర్చ
అనకాపల్లి టౌన్: స్థానిక నాలుగురోడ్ల జంక్షన్ వద్ద చాయ్ పే చర్చ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌కు పలు సమస్యలపై వివిధ వర్గాల వారు ఏకరువు పెట్టారు. పట్టణ నడిబొడ్డున, మున్సిపల్ స్కూల్ పక్కన్న డంపింగ్ యార్డు తక్షణమే తరలించాలన్నారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టును అనకాపల్లి వరకు పొడిగించాలన్నారు.