
మార్కెట్లకు శ్రావణ శోభ
● కొనుగోలుదారులతో దుకాణాల కిటకిట ● చుక్కలు చూపిస్తున్న పూజా సామగ్రి ధరలు ● కిలో చామంతులు రూ.800
నక్కపల్లి: సకల సంపదలకు ప్రతీక లక్ష్మీదేవి ఆరాధనకు ఊరూవాడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మార్కెట్లు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో పూజాసామగ్రి కొనుగోలుదారులతో నక్కపల్లి, అడ్డురోడ్డు, పాయకరావుపేట – తుని పట్టణాల్లో దుకాణాలు, మార్కెట్లు కిటకిటలాడాయి. పూలు, బంగారం, కిరాణా, వస్త్ర దుకాణాలు రద్దీగా మారాయి. ఈ ఏడాది బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో దుకాణాలు వెలవెలబోతున్నాయి. సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో గతంలో మాదిరిగా వరలక్ష్మి పూజకు అసవరమైన లక్ష్మీరూపులు కొనేందుకు మహిళలు ఆసక్తి చూపడం లేదు. గతంలో లక్ష్మీరూపులు రూ.1500 నుంచి రూ.3వేల వరకు లభించేవి. ఈ ఏడాది తక్కువ బరువులో లక్ష్మీరూపులు విక్రయించడం లేదు. గ్రాము బరువుగల లక్ష్మీరూపు రూ.9,800లకు విక్రయిస్తున్నారు. అన్ని బంగారం షాపుల్లోనే ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో లక్ష్మీరూపు కొనుగోలు చేసి అమ్మవారి పూజ చేసుకోవడం మా వల్ల కాదంటూ సామాన్య, మధ్య తరగతి మహిళలు చేతులేత్తెస్తున్నారు. కొద్దోగొప్పో స్థోమత ఉన్నవారు గ్రాము విలువల లక్ష్మీరూపులను కొనుగోలు చేస్తున్నారు. సామాన్యులైతే ఈ ఏడాది అమ్మవారికి పసుపు కుంకుమ, గాజులు, కొత్త చీర పిండివంటలతోనే కానిచ్చేసే పరిస్థితి నెలకొంది.
పండ్లు, పూల ధరలకు రెక్కలు..
పండ్లు, పూల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. డజన్లలో అరటి పండ్లు రూ.80, చిన్నపాటి యాపిల్ రూ.250, దానిమ్మ రూ.360, జామకాయలు రూ.80 చొప్పున విక్రయించారు. పూల ధరలు చుక్కలను చూపించాయి. చామంతులు ఇంతులకందని పరిస్థితి నెలకొంది. కిలో చామంతి పూలు రూ.800, గులాబీలు కిలో రూ.400 చొప్పున విక్రయించారు. అంత ఖరీదు పెట్టి కొనలేక విడిగా కొనుక్కుందామంటే చామంతి పువ్వు ఒక్కొక్కటి ఐదు రూపాయలకు విక్రయిస్తున్నారు. గులాబీలు రూ.10, కనకాంబరాలు మూర రూ.80, మల్లెలు రూ.100లకు విక్రయించారు. చామంతి, బంతి పూలను విడిగానే కొనుక్కోవాల్సి వచ్చింది. బత్తాయి, దానిమ్మ, జామ, యాపిల్‌ల ధరలు వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని భారీగా పెంచేశారు. ఇంటిల్లిపాది సంగతి అలా ఉంచితే కనీసం అమ్మవారికి తొమ్మిది రకాల పిండివంటలు చేసి నైవేద్యం పెట్టడానికయినా కిరాణా సరకులు కొందామంటే ధరలు చూసి సామాన్యులు గిలగిల కొట్టుకునే పరిస్థితి నెలకొంది. పప్పు దినుసులు, బెల్లం, పంచదార, తదితర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

మార్కెట్లకు శ్రావణ శోభ

మార్కెట్లకు శ్రావణ శోభ