
ఓటమి భయంతోనే టీడీపీ హత్యా రాజకీయాలు
● వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు త్రినాథరావు ● పులివెందులలో పార్టీ నేతల దాడిపై సర్వత్రా నిరసన
అనకాపల్లి: ఓటమి భయంతో టీడీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు త్రినాథరావు ధ్వజమెత్తారు. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి ఉప ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగివస్తున్న వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వేల్పుల రాముపై హత్యాయత్నానికి పల్పడిన టీడీపీ గూండాలను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారిపై దాడిని నిరసిస్తూ గురువారం స్థానిక రింగ్‌రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకుముందు మహాత్మ జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు విరక్తి చెందారని ఆమె పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభలకు వస్తున్న జనాన్ని చూసి, కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకొని పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకట్ మాట్లాడుతూ రమేష్ యాదవ్‌పై దాడులు చేయించిన బీటెక్ రవి తమ్ముడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, 80వ వార్డు ఇన్‌చార్జ్ కె.ఎం.నాయుడు, యలమంచిలి జెడ్పీటీసీ సేనాపతి సంథ్యారాము, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, పార్టీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షుడు పల్లెల సాయి కిరణ్, మండల యువజన విభాగం అధ్యక్షుడు బాధపు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తక్షణమే అరెస్టు చేయాలి
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, పార్టీ నాయకులపై దాడికి పాల్పడిన టీడీపీ గుండాలను తక్షణమే అరెస్టు చేయాలని సమాజ్‌వాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోన గురువయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేడ్కర్‌ను కాదని రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై కక్ష కట్టారన్నారు.
పక్కా స్కెచ్‌తోనే దాడి
దేవరాపల్లి: పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడిని వైఎస్సార్‌సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ ఖండించారు. తారువలో గురువారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ.. జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ ప్రజలను, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను భయభ్రాంతులకు గురి చేసేందుకు పక్కా స్కెచ్‌తోనే దాడికి తెగబడ్డారని ఆరోపించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించేలా ఈసీ చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

ఓటమి భయంతోనే టీడీపీ హత్యా రాజకీయాలు