అయోధ్య పేరిట వ్యాపారం? | - | Sakshi
Sakshi News home page

అయోధ్య పేరిట వ్యాపారం?

Jul 23 2025 7:03 AM | Updated on Jul 23 2025 7:03 AM

అయోధ్య పేరిట వ్యాపారం?

అయోధ్య పేరిట వ్యాపారం?

ఫిర్యాదు చేసిన భద్రాచలం దేవస్థానం అధికారులు

డబ్బుల వసూళ్లు తప్పుడు ప్రచారం అంటున్న నిర్వాహకులు

బీచ్‌రోడ్డు: ఉత్తరాంధ్ర ప్రజల కోసం నగరంలో ఏర్పాటు చేసిన అయోధ్య రామమందిర నమూనా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. విశాఖ బీచ్‌ రోడ్డులోని వైఎస్సార్‌ విగ్రహం ఎదురుగా ఈ సెట్‌ను గరుడ అనే సంస్థ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సెట్‌ ఆధారంగా అయోధ్య పేరిట వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారి వ్యాపారంలో భద్రాచలం దేవస్థానాన్ని వాడుకోవటంపై ఆ దేవస్థానం ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటు సెట్‌ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇదంతా తమపై కావాలనే కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారమని నిర్వాహకులు చెప్తున్నారు.

కల్యాణోత్సవం పేరిట వసూళ్లు

అయోధ్య రామ మందిరం సెట్‌ వేసి భక్తులకు రాముని దర్శనం కల్పించారు. అంతవరకు బాగానే ఉంది. ఈ నెలాఖరుకు ఈ సెట్‌ను తొలగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అయోధ్య రాముని కల్యాణోత్సవానికి నిర్వాహకులు సిద్ధమయ్యారు. దీన్ని స్వయంగా భద్రాచలం దేవస్థానం పండితులచే నిర్వహించనున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం భక్తుల నుంచి రూ.2,999 చొప్పున వసూళ్లు చేస్తుండటమే ఆరోపణలకు తావిచ్చింది.

భద్రాచలం అధికారుల ఫిర్యాదు

ఈ కల్యాణోత్సవంలో తమ దేవస్థాన పండితులు ఎవరూ పాల్గొనటం లేదని, ఇది కేవలం తప్పుడు ప్రచారమేనని భద్రాచలం దేవస్థానం అధికారులు మూడో పట్టణ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా తమ దేవస్థానం పేరు వాడుకుని భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తప్పుడు రసీదుతో దుష్ప్రచారం

ఈ వివాదంపై గరుడ సంస్థ నిర్వాహకుడు దుర్గాప్రసాద్‌ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి, మాట్లాడారు. కల్యాణోత్సవం కోసం భక్తుల నుంచి రూ.2,999 వసూళ్లు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్న రసీదును కొందరు కావాలనే తప్పుడు ప్రింటింగ్‌ చేశారని తెలిపారు. కొండవీటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో జరిగే ఈ కల్యాణోత్సవంలో భద్రాచలం నుంచి తీసుకొస్తున్న బ్రాహ్మణ బృందం పాల్గొంటుదని చెప్పామే తప్ప, భద్రాచలం దేవస్థానం పండితులచే నిర్వహిస్తున్నట్లు ఎక్కడా ప్రచారం చేయలేదన్నారు. తమపై కావాలనే ఎవరో చేస్తున్న తప్పుడు ప్రచారమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement