విద్యా వ్యాపారంపైనే నా యుద్ధం | - | Sakshi
Sakshi News home page

విద్యా వ్యాపారంపైనే నా యుద్ధం

Jul 23 2025 7:03 AM | Updated on Jul 23 2025 7:03 AM

విద్యా వ్యాపారంపైనే నా యుద్ధం

విద్యా వ్యాపారంపైనే నా యుద్ధం

● ఆగస్టు 22న ‘యూనివర్సిటీ పేపర్‌ లీకేజ్‌’ విడుదల ● కార్పొరేట్‌ కళాశాలలు, కోచింగ్‌ సెంటర్ల దురాగతాలే ఈ చిత్ర కథాంశం ● పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి

మద్దిలపాలెం: సమకాలీన సామాజిక సమస్యలనే కథాంశాలుగా తాను తీసిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారని పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి తెలిపారు. విద్యను వ్యాపారం చేస్తూ, ర్యాంకుల పేరుతో లీకేజీలకు పాల్పడుతున్న కార్పొరేట్‌ విద్యా వ్యవస్థపై పోరాటంగా ‘యూనివర్సిటీ పేపర్‌ లీకేజ్‌’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తాను కథనందించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్నేహచిత్ర పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మించినట్లు తెలిపారు. ఈ సినిమా ఆగస్టు 22న విడుదల కానుందని.. ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ చిత్ర పోస్టర్‌ను మంగళవారం ఏయూ బాస్కెట్‌బాల్‌ కోర్టు ప్రాంగణంలో విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం చిత్ర విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.

తల్లిదండ్రుల కన్నీటిగాథలే ఇతివృత్తంగా..

‘విద్య, వైద్యం సేవా రంగంలో ఉన్నప్పుడే అందరికీ సమానంగా అందుతాయి. కానీ ఇప్పుడు విద్యను వ్యాపారంతో ముడిపెట్టి, కార్పొరేట్‌ విద్యకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్‌ కళాశాలలు మాది ఫస్ట్‌ ర్యాంక్‌, మాది బెస్ట్‌ ర్యాంక్‌ అంటూ ప్రచార మాధ్యమాల్లో హోరెత్తిస్తూ.. కాసుల కక్కుర్తితో పేపర్‌ లీకేజీలకు పాల్పడుతున్నాయి. దీని వల్ల కష్టపడి చదివిన పేద విద్యార్థి మంచి ర్యాంకు సాధించలేక చతికిలపడుతున్నాడు. మరోవైపు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు కిడ్నీలు అమ్ముకునే దుస్థితికి చేరుతున్నారు. వారి ఆవేదన చూసే ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నాను’అని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు చేస్తున్న దోపిడీ కారణంగా, తమ పిల్లలకు మంచి విద్యను అందించాలనే తాపత్రయంలో సగటు సామాన్యుడు పడుతున్న కన్నీటి గాథలను ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశానని వివరించారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా..’‘వందనం వందనం ఆది గురువు అమ్మకు, సకలం బోధించే గురువులకు వందనం..’అనే పాటలను పాడి విద్యార్థులను ఉత్సాహపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement