
పాత నేరస్తుడు అరెస్టు
● చోరీ సొత్తు రికవరీ
అనకాపల్లి టౌన్: దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్ట్ చేసి, చోరీ సొత్తును రికవరీ చేసుకున్నట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుడు బెజవాడ రాము మాడుగులలో హల్వా దుకాణంలో పనిచేస్తున్నాడు. అతనికి వచ్చే జీతం వ్యసనాలు, ఇంటి అవసరాలకు సరిపోవడంలేదు. దాంతో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో మాడుగులలో ఈ నెల 4న ఒక ఇంట్లో, అదే నెల 11వ తేదీన మామిడి లక్ష్మి ఇంట్లో దొంగతనాలు చేసి ఇరవై రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, 900 గ్రాముల వెండి వస్తువులు, రూ.1.90 లక్షలు ఎత్తుకుపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు మంగళవారం ఘాటీరోడ్డు జంక్షన్ వైపు వస్తుండగా, అక్కడ రెక్కీ నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి మొత్తం బంగారం, నగదును రికవరీ చేసుకున్నారు. గతంలో పలు దొంగతనాలకు పాల్పడిన అతడిపై మొత్తం ఆరు కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో కె. కోటపాడు సీఐ పెడపునాయుడు, ఎస్‌ఐ జి. నారాయణరావు పాల్గొన్నారు.