
బీమాతో ధీమా
● తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు ● గ్రామస్థాయి జన సురక్ష పేరిట పథకాలు ● మూడు నెలల కాలంలో ప్రీమియం చెల్లించేలా అవగాహన సదస్సులు
మునగపాక: చిన్న ప్రీమియం.. అందరికీ పేద్ద రక్షణ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పలు పథకాలను అమలు చేస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. తక్కువ ఫ్రీమియంతో బీమా సదుపాయం దక్కించుకునేలా గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. మూడు నెలల కాలంలో అర్హులందరితో ప్రీమియం చెల్లించేలా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇలా.....
ప్రధానమంత్రి సురక్ష బీమా పథకానికి లబ్ధిదారు ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లించాలి. ఇలా చెల్లించిన వారికి ప్రమాద బీమా కింద రూ.2 లక్షలు అందుతుంది. ఈ పథకం తీరు తెన్నులు ఇలా.. మరణం లేదా శాశ్వత పూర్తి వైకల్యం సంభవించినట్లయితే రూ.2 లక్షల ప్రమాద బీమా కింద సాయం అందుతుంది. శాశ్వత, పాక్షిక వైకల్యానికి రూ.లక్ష బీమా సాయం అందుతుంది. సంవత్సరానికి కేవలం రూ.20 ప్రీమియంగా చెల్లించాలి. 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులుగా పేర్కొన్నారు.
ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకం ఇలా..
ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లిస్తే రూ.2 లక్షల మేర జీవిత బీమా యోజన కింద అందజేస్తారు. వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల వారికే ఈ పథకం కింద అర్హులుగా నిర్ణయించారు.
అటల్ పెన్షన్ పథకం ఇలా...
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన అటల్ పెన్షన్ విధానం అమలు తీరు ఇలా ఉంది. 60 సంవత్సరాల వయస్సు తర్వాత నెలకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు కనీస హామీ పెన్షన్. చందాదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి అదే పెన్షన్ లభిస్తుంది. చందాదారుడు, అతని జీవిత భాగస్వామి మరణించినట్లయితే తర్వాత నామినీ 60 సంవత్సరాల వయస్సు వరకు సేకరించిన పెన్షన్ సంపదను అందుకుంటారు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సున్న పౌరులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు.
3 నెలల ఆర్థిక చేరిక కేంద్రీకృత ప్రయత్నం...
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన జన సురక్ష కార్యక్రమం మూడు నెలల పాటు అమలు జరిగేలా చర్యలు చేపట్టారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు అర్హులైన వారు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూడు నెలల కాలంలో ప్రీమియం చెల్లించిన వారికి మాత్రమే బీమా పథకాలు అమలులోకి తీసుకువస్తున్నారు. భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ఈ జన సురక్షను అందుబాటులోకి తీసుకువచ్చారు.
గ్రామ సంఘాల ద్వారా జన సురక్షపై అవగాహన..
వెలుగు కార్యాలయం అధికారులు గ్రామ జన సురక్ష కార్యక్రమంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. డ్వాక్రా సంఘ సభ్యులకు సురక్ష కార్యక్రమం ద్వారా జరిగే మేలును ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ఎంత ప్రీమియం చెల్లిస్తే బీమా పథకాలు అందుతాయన్న విషయమై సందేహాలను నివృత్తి చేస్తున్నారు. చిన్న ప్రీమియం అందరికీ పెద్ద రక్షణ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.
అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
గ్రామ సురక్ష పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాల్లో డ్వాక్రా మహిళలకు ఈ పథకం తీరుతెన్నులపై అవగాహన కల్పిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. వయస్సు ప్రామాణికంగా తీసుకొని ప్రీమియం చెల్లించేలా చర్యలు చేపడుతున్నాం.
వై.బాలరాజు, వెలుగు ఏపీఎం

బీమాతో ధీమా