
మంచినీరు ఇవ్వండి మహాప్రభో.!
మంచినీటి కుళాయిలు పాడై 10 రోజులు గడుస్తున్నా పంచాయతీ పాలకులు పట్టించుకోవడం లేదని, మంచినీరు అందించి దాహం తీర్చాలంటూ కశింకోట మండలం బంగారయ్యపేట ఎస్సీ కాలనీ దళిత మహిళలు పిల్లలతో వచ్చి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. మంచినీరు సరఫరా కావడం లేదని సచివాలయంలో మొత్తుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని, దళితులుగా ఉన్న తమను ఇప్పటికీ అంటరాని వారిగానే చూస్తున్నార ఆవేదన వ్యక్తం చేశారు. చెత్తా చెదారం వేసే మురుగు కూపం వద్ద ఉన్న కుళాయికి పోయి నీరు తెచ్చుకోవాలంటున్నారు గానీ, ఇంటింటికీ కుళాయిల ద్వారా నీటిని మాత్రం సరఫరా చేయడం లేదని వాపోయారు. కాలనీలో ఉన్న బోరు కూడా మూడేళ్లుగా పనిచేయడం లేదని, తక్షణమే అధికారులు స్పందించి మంచినీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.