
కుంగిన కల్వర్టు.. ఆగిన ఆర్టీసీ బస్సు సర్వీసులు
● విశాఖ నుంచి కృష్ణారాయుడిపేట వరకే బస్సులు ● ప్రయాణికులకు తప్పని పాట్లు
దేవరాపల్లి: దేవరాపల్లి నుంచి కొత్తవలస మీదుగా విశాఖపట్నం వెళ్లే రహదారిలో కృష్ణారాయుడుపేట వద్ద కల్వర్టు కుంగిపోవడంతో సోమవారం 12డీ, 68డీ ఆర్టీసీ బస్సు సర్వీసుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో నిత్యం పదుల సంఖ్యలో బస్సులు, వందలాది మంది ప్రయాణికులతో కళకళలాడే దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వెలవెలబోయింది. ఆర్‌అండ్‌బీ అధికారులు కుంగిన కల్వర్టుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి, రాకపోకలు నిలిపివేశారు. విశాఖపట్నం నుంచి ఆనందపురం, దేవరాపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు కృష్ణారాయుడుపేట వరకు బస్సులో వచ్చి అక్కడి నుంచి ఆటోల్లో ప్రయాణించి గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. కొత్తవలస వైపు వెళ్లాల్సిన వారు ఆనందపురం నుంచి కృష్ణారాయుడుపేట వరకు ఆటోల్లో వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ప్రైవేటు వాహనచోదకులు అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నట్లు పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకులకు ముందు చూపు లేని కారణంగానే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. బస్సు సర్వీసుల నిలిపివేత విషయాన్ని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి దృష్టికి ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం సహా పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తీసుకెళ్లారు.
దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ కల్వర్టు నిర్మాణానికి సుమారు రూ.90 లక్షల జీవీఎంసీ నిధులు మంజూరయ్యాయని, వారంలోగా టెండర్ పూర్తి చేసి పనులు చేపడతామన్నారు.