
జగనన్నను కలిసి మాట్లాడతా..
● ఆ తర్వాతే రాజీనామాపై తుది నిర్ణయం ● ఎంపీపీ బొలిశెట్టి గోవిందు
నక్కపల్లి/ఎస్.రాయవరం: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన తర్వాత రాజీనామాపై తుది నిర్ణయం ప్రకటిస్తానని ఎస్.రాయవరం ఎంపీపీ, వైఎస్సార్‌సీపీ మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి గోవిందు తెలిపారు. సోమవారం ఆయన ఎస్.రాయవరంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేతను కలసి సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం కల్పించకపోవడంతో మనస్తాపం చెందానన్నారు. పార్టీ నేతలు, తన అభిమానులు వచ్చి త్వరలోనే జగనన్నను కలిసి సమస్యలు వివరిద్దామని, రాజీనామాపై పునరాలోచన చేయాలని కోరారన్నారు. పార్టీ పెద్దలు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తదితరులు తనతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారన్నారు. త్వరలోనే పార్టీ అధినేత జగన్ అపాయింట్‌మెంట్ ఇప్పించి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారన్నారు.