
కలగానే.. ఈఎస్‌ఐ ఆస్పత్రి
పరవాడ: పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పరవాడ ప్రాంతంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపాలని కొన్నేళ్లుగా కార్మిక వర్గం మొరపెట్టుకుంటోంది. అయినా తమ అభ్యర్థనను పట్టించుకునే నాథుడే లేడంటూ వాపోతోంది. ఇక్కడ పరవాడ ప్రాంతంలో జవహార్‌లాల్ నెహ్రు ఫార్మాసిటీ, సింహాద్రి ఎన్టీపీసీ, ఇండస్ట్రియల్ పార్క్ వంటి పరిశ్రమలు ఏర్పాటై పాతికేళ్లు దాటింది. జేఎన్ ఫార్మాసిటీలోనే 108 పరిశ్రమల్లో సుమారు 20 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సింహాద్రి ఎన్టీపీసీలో 1600 మంది కార్మికులున్నారు. వీరంతా ఈఎస్‌ఐ చెల్లిస్తున్నారు. అయినా వాటి ప్రయోజనాలు పూర్తిగా పొందలేకపోతున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులే దిక్కు
ఇక్కడి పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో క్షతగాత్రులైన కార్మికులకు అత్యవసర వైద్య సేవలందించేందుకు స్థానికంగా ఎలాంటి ఆస్పత్రులూ లేవు. ఏ చిన్న ప్రమాదం జరిగినా బాధితులను విశాఖ, అనకాపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్చి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించడానికి అంబులెన్స్ సౌకర్యం కూడా అంతంత మాత్రమే. స్థానికంగా ఈఎస్‌ఐ ఆస్పత్రి సదుపాయం లేకపోవడంతో కార్మికులు, వారి కుటుంబాలు కూడా మెరుగైన వైద్య సేవలు పొందలేని పరిస్థితి. వీరికి ఏదైనా ఆనారోగ్య సమస్య తలెత్తితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం కోసం చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది.
ప్రారంభించకుండానే మూసేశారు
కార్మికులు ఎదుర్కొంటున్న అవస్థల నేపథ్యంలో పరవాడ ప్రాంతంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కార్మిక వర్గాలు కొన్నేళ్లుగా గగ్గోలు పెడుతున్నా ఈఎస్‌ఐ అధికారులకు, ప్రజాప్రతినిధులకు పట్టని పరిస్థితి. గతంలో పరవాడలో ఈఎస్‌ఐ అధికారులు తాత్కాలిక ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేసి, దాన్ని తెరవకుండానే ఇటీవల మూసేశారు. ఫలితంగా ఏ చిన్న ప్రమాదం జరిగినా, అనారోగ్య సమస్యలు తలెత్తినా దూర ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులపై ఆధారపడాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరవాడలో ఈఎస్‌ఐ ఆస్పత్రికి కార్మికుల డిమాండ్
దశాబ్దాలుగా పట్టించుకోని పాలకులు, అధికారులు
ఏ చిన్న ప్రమాదం జరిగినా విశాఖ, అనకాపల్లి టౌన్‌కు పరుగులు