
అనధికార లేఅవుట్ కోసం చెరువు కబ్జా
అనధికార లేఅవుట్ కోసం చెరువును కబ్జా చేశారంటూ చోడవరం మండలం వెంకన్నపాలెం పంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామస్తులు కలెక్టరేట్‌లో సోమవాం ఫిర్యాదు చేశారు. కబ్జాదారుల చెర నుంచి చెరువును స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో సర్వే నంబర్ 527లో చెరువు భూమిలో పంచాయతీ నిధులతో నిర్మించిన డంపింగ్ యార్డ్‌ను మూసి, అందులో నుంచి తారు రోడ్డు నిర్మించి కొందరు వ్యక్తులు లేఅవుట్ వేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పంచాయతీ సర్పంచ్, వీఆర్వో, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. అలాగే ఉపాధి హామీ పథకంలో దొంగ మస్తర్లు వేసి పనికి రాని వారికి కూడా బిల్లులు చెల్లిస్తూ అవినీతికి పాల్పడుతున్న సిబ్బందిపై విచారణ చేపట్టాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.