
లోక్ అదాలత్‌తో సత్వర పరిష్కారం
లోక్ అదాలత్ కార్యక్రమంలో మాట్లాడుతున్న పదో అదనపు జిల్లా జడ్జి నరేష్
అనకాపల్లి టౌన్: కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్‌లు ఉపకరిస్తాయని, లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పదో అదనపు జిల్లా జడ్జి నరేష్ తెలిపారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకోకుండా ఎదురైన గొడవలతో కేసులు పెట్టుకుని కాలంతో పాటు ఆర్థికంగా నష్టపోకూడదని వివరించారు. కోర్టు చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోకుండా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కక్షిదారుల ప్రయోజనం కోసం సుప్రీంకోర్టు ఈ అదాలత్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్ కోర్టు న్యాయమూర్తి నాగేశ్వరరావు, అడిషనల్ సబ్ కోర్టు న్యాయమూర్తి రామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లా హర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.