
ప్రకృతి వ్యవసాయం స్ఫూర్తిదాయకం
జార్ఖండ్ రాష్ట్ర రైతు బృందం ప్రశంస
కశింకోట: మండలంలో రైతు సాధికార సంస్థ ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని జార్ఖండ్ రాష్ట్రం రామ్‌గడ్ జిల్లాకు చెందిన రైతు బృందం ప్రశంసించింది. జాతీయ వనరుల సంస్థ (ఎన్‌ఆర్‌ఒ) ద్వారా నాబార్డ్ జీవా కార్యక్రమంలో భాగంగా గురువారం ఈ బృందం మండలంలోని లాలంకొత్తూరు, జి.భీమవరం, సుందరయ్యపేట గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా లాలంకొత్తూరులో ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే జీవామృతం, ద్రవ్యాల తయారీని పరిశీలించారు. జీవామృతంతో వరి విత్తన శుద్ధి, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగించారు. జి. భీమవరంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి అక్కడ ఏటీఎం విధానంలో సాగవుతున్న నవ ధాన్యాలు, ఇతర విత్తనాల సాగును పరిశీలించింది. ప్రకృతి సాగుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఆరోగ్యవంతమైన ఆకు కూరలు, కూరగాయలు, పండ్ల చెట్ల సాగు వల్ల వచ్చే ఫలసాయం సొంత అవసరాలకు వినియోగించుకొని మిగిలిన వాటిని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న విధానాన్ని వివరించారు. సుందరయ్యపేటలో రైతులు 40 ఎకరాల కాంపాక్ట్ బ్లాక్ మోడల్‌లో వేసిన నవ ధాన్య విత్తనాల సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా పంటల సాగుకు, పంటలపై వచ్చే తెగుళ్ల నివారణకు వాడే జీవామృతం తయారీ విధానాన్ని ప్రకృతి వ్యవసాయం ప్రతినిధి కూండ్రపు అరుణ వివరించగా బృందం అభినందనలు తెలిపింది. జార్ఖండ్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తుంటామని బృందం రైతులు తెలిపారు. ఏపీ రాష్ట్ర ఎన్‌ఆర్వో ప్రతినిధి ఎం.చందు, రీజనల్ ఆఫీస్ నార్త్ కోస్టల్ ఎన్‌ఎఫ్‌ఎ తరుణ్ ఆదిత్య, హేమలత, ఎన్‌ఎఫ్‌ఎ రామగోవిందు పాల్గొన్నారు.