
వినియోగదారుల అవసరాలే వ్యాపార అభివృద్ధికి కీలకం
ఏయూ క్యాంపస్: వినియోగదారుడి అవసరాలు తెలుసుకుంటేనే వ్యాపార అభివృద్ధి సాధ్యపడుతుందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్‌ఏఐ) సీఈవో కుమార్ రాజగోపాలన్ అన్నారు. బుధవారం బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో నిర్వహించిన విశాఖపట్నం రిటైల్ సమ్మిట్‌ను సీఎంఆర్ అధినేత మావూరి వెంకట రమణ, కంకటాల సంస్థల అధినేత కంకటాల మల్లికార్జునరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కుమార్ రాజగోపాలన్ మాట్లాడుతూ నేటితరం రిటైల్ మార్కెటింగ్‌లో వేగం, కచ్చితత్వం ప్రధానంగా మారాయన్నారు. సృజనాత్మకంగా ఉంటూ తమ బ్రాండ్‌ను నిలుపుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. భారత ఆర్థిక వ్యవస్థపై రిటైల్ రంగం ఎంతో ప్రభావాన్ని చూపుతుందని, ఉపాధి కల్పనతో పాటు జీడీపీ వృద్ధికి దోహదపడుతోందన్నారు. మావూరి వెంకట రమణ మాట్లాడుతూ కలసి ప్రయాణించడం, ఆలోచనలను పంచుకోవడం ఎంతో అవసరమన్నారు. కంకటాల మల్లికార్జునరావు మాట్లాడుతూ రిటైల్ వ్యాపారాన్ని ఆస్వాదించే దృక్పథం ఉంటేనే కొనసాగాలన్నారు. మన కష్టాన్ని పెట్టాలని, ఫలితం వెంటనే ఆశించడం సరికాదన్నారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులపై నమ్మకం ఉంచడం, వారి ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేస్తూ, వారిలోని లోపాలను రూపు మాపే ప్రయత్నం చేయాలన్నారు. వినియోగదారుడితో మసలుకునే విధానం, వారితో సంభాషించే విధానం వ్యాపారాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయన్నారు. నాలుగు దశాబ్దాలుగా రిటైల్ వ్యాపార రంగంలో తాను స్వయంగా తెలుసుకున్న అనేక సూత్రాలను, నైపుణ్యాలను వివరించారు.
తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ రంగం అభివృద్ధి
హైదరాబాద్ ఆర్‌ఏఐ ప్రాంతీయ శాఖ చైర్మన్ అవినాష్ ఆనంద్ మాట్లాడుతూ దక్షిణాదిలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధిస్తోందన్నారు. అంతర్జాతీయ బ్రాండ్‌లు సైతం భారత్‌కి రావడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఆగస్టు 6న హైదరాబాద్‌లో ఆర్‌ఏఐ సమ్మిట్ జరుగుతుందని, అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు. విశాఖ వేదికగా రిటైల్ రంగానికి ఆశాజనకంగా ఉంటుందన్నారు. అనంతరం నిర్వహించిన చర్చావేదికలో భవిష్యత్తులో వినియోగదారుల వస్తు ప్రభావం అనే అంశంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మెట్రో నగరాలతో పాటు ఇక్కడి పరిస్థితులను, అవకాశాలను వివరించారు. టైర్–2, టైర్–3 నగరాల్లో వస్తున్న మార్పులపై చర్చించారు.
ఆర్‌ఏఐ సీఈవో కుమార్ రాజగోపాలన్