
ఈనెల కూడా కందిపప్పు లేనట్టే..!
అనకాపల్లి టౌన్ : కందిపప్పు బలవర్ధకమైన ఆహార పదార్ధం. చక్కగా ప్రోటీన్ లభిస్తుంది. సామాన్యుడు చౌకధరల దుకాణంలో లభించే కందిపప్పుకు అర్రులు చాస్తుంటాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలుగా రేషన్ షాపులలో కందిపప్పు, రాగులు, గోధుమపిండి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాగులు, గోధుముల సంగతి పక్కన పెడితే కనీసం కందిపప్పు సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ నెల కూడా కందిపప్పును అడగొద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 5,37,038 మంది కార్డుదారులకు 14,99,000 యూనిట్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 7652 మెట్రిక్ టన్నుల బియ్యం, 264 మెట్రిక్ టన్నుల పంచదార, 546 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 544 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 1628 మెట్రిక్ టన్నుల రాగులు సరఫరా చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవి నిలిచిపోయాయి. కొన్ని నెలలు అరకొరగా పంపిణీ చేసిన ప్రభుత్వం ఆరు నెలలుగా పూర్తిగా నిలిపివేసింది. పేదలకు నిత్యావసర వస్తువైన కందిపప్పును సరఫరా చేయలేని ప్రభుత్వం రాగులు, గోధుమ ఇంకేమి ఇస్తుందని కార్డుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే రేషన్ షాపుల్లో పూర్తిగా కందిపప్పు నిలిపివేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.