
‘నషా ముక్త్ భారత్’లో భాగస్వాములు కండి
తుమ్మపాల: యువత గంజాయి, డ్రగ్స్, మద్యపానం వంటి దురాచారాలకు బానిసలు కాకుండా వారిలో చైతన్యం కలిగించడం మనందరి బాధ్యత అని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీ కార్యక్రమంపై ఆమె ఎస్పీ తుహిన్ సిన్హా, జిల్లా అధికారులతో కలిసి ఆర్డీవోలు, మండల స్థాయి అధికారులతో బుధవారం వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్రాలలో నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని గురువారం సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పెద్ద ఎత్తున చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమన్ని ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించేలా రూపొందించాలన్నారు. ర్యాలీలో యువత, మహిళలు, విద్యార్థులు, గ్రామ, వార్డు సచివాలయల సిబ్బంది మరియు ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. నేటి తరానికి, రేపటి భవిష్యత్ పౌరులకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన సమాజం అందించాలంటే, ఈ విధమైన చైతన్య ర్యాలీలు కీలకమన్నారు. జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలసి ర్యాలీలో పాల్గొని ‘నషా ముక్త భారత్ అభియాన్’ లక్ష్యాన్ని సాకారం చేయడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సత్యనారాయణరావు, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీఓలు షేక్ అయిషా, వి.వి.రమణ, డీఎస్పీలు, సీఐలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.