
జనసేనకు టీడీపీ జెల్ల
● పొత్తు ధర్మం విస్మరించి ఎన్నికకు డుమ్మా కొట్టిన పలువురు టీడీపీ కార్పొరేటర్లు ● ఇద్దరు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే కూడా గైర్హాజరు ● కోరంకు 56 మంది అవసరం కాగా 54 మంది హాజరు ● నేటికి ఎన్నిక వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి ప్రకటన
డాబాగార్డెన్స్ (విశాఖ): జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికలో జనసేనకు మిత్రపక్షమైన టీడీపీ జెల్ల కొట్టింది. పొత్తు ధర్మం మరిచి డిప్యూటీ మేయర్ కుర్చీ కోసం కుయుక్తులు పన్నింది. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించగా.. సోమవారం జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి పలువురు టీడీపీ ఆశావాహులు డుమ్మా కొట్టారు. దీంతో కోరం లేకపోవడంతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ మంగళవారం నాటికి సమావేశం వాయిదా వేశారు. ముందస్తు సమాచారం మేరకు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రత్యేక సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభం కావల్సి ఉంది. ఆ సమయానికి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఆ పార్టీ కార్పొరేటర్ కవితతోపాటు సీపీఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, సీపీఐ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ హాజరయ్యారు. 11.10 గంటలకు జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్‌బాబు కౌన్సిల్‌కు వచ్చారు. 11.15 గంటలకు జనసేనకు చెందిన 14 మంది కార్పొరేటర్లు సమావేశ మందిరానికి చేరుకున్నారు. 11.20 గంటలకు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వచ్చారు. 11.30 గంటలకు కాకి గోవిందరెడ్డి మినహా టీడీపీ కార్పొరేటర్లు ఎవరూ హాజరు కాలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్ 11.40 గంటలకు కౌన్సిల్ హాల్లోకి అడుగుపెట్టారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి మయూర్ అశోక్ 11.53 గంటలకు సమావేశానికి హాజరయ్యారు. వచ్చిన వెంటనే ఎంత మంది సభ్యులు వచ్చారో లెక్కించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికకు 56 మంది అవసరం కాగా 54 మందే హాజరయ్యారని.. కోరం తగ్గట్టు సభ్యులు లేరని గుర్తించారు. దీంతో సమావేశాన్ని మంగళవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జనసేన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.