
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలి
తుమ్మపాల: విద్యాసంస్థలకు వేసవి సెలవుల దృష్ట్యా జిల్లాలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను విద్యార్థులు వినియోగించుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్, జేసీ ఎం.జాహ్నవి అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం తన చాంబర్‌లో వేసవి క్రీడా శిబిరాల క్రీడాకారులకు క్రీడా పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 50 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులందరూ క్రీడా శిబిరాలను వినియోగించుకుని ఆటలలో బాగా రాణించాలని, భవిష్యత్తులో పతకాలు సాధించాలన్నారు. ఆటల వల్ల విద్యార్థుల మనో వికాసం పెరుగుతుందని, ఆరోగ్యం బాగుంటుందని, చదువులో రాణిస్తారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటలలో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలన్నారు. ప్రతి క్రీడా శిబిరానికి రూ.5 వేలు విలువచేసే క్రీడా పరికరాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎల్.వి.రమణ క్రీడా శిక్షణ శిబిరాల వివరాలు తెలియజేస్తూ జిల్లాలో ఏర్పాటు చేసిన 50 శిక్షణ శిబిరాలకు 982 మంది విద్యార్థుల పేర్లు నమాదు చేసుకున్నారని, వారిలో 612 మంది బాలురు, 370 మంది బాలికలు ఉన్నారన్నారు. వీరికి 20 క్రీడా అంశాలలో శిక్షణ అందిస్తున్నామన్నారు. 8 నుండి 14 ఏళ్ల వయస్సు గల విద్యార్థులలో ప్రతిభావంతులను గుర్తించి వారిని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం క్రీడా శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్ ఆటల పోటీల్లో వెండి పతకం సాధించిన ఖోఖో జాతీయ స్థాయి రజత పతక విజేత శ్యామ్ ప్రసాద్‌ను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు కె.త్రిమూర్తులు, రెహమాన్, చిరంజీవి, రమేష్, అచ్చుతాపురం, జిల్లాపరిషత్ పాఠశాల క్రీడా శిబిరం, హరిపాలెం రగ్బీ ఆట శిబిరం, అక్కిరెడ్డిపాలెం క్రీడాశిబిరం విద్యార్థులు పాల్గొన్నారు.