
ఉగ్రదాడులను ఎదుర్కొందామిలా..
అనకాపల్లిలో మాక్ డ్రిల్
అనకాపల్లి: ఉగ్రదాడులు, విపత్తులను ఎదుర్కోవడంపై అవగాహన కల్పించేందుకు అనకాపల్లిలో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పూడిమడక రోడ్డులోని గ్రీన్ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో శేషాద్రి బ్లాక్ వద్ద ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, వైద్యారోగ్య శాఖలు పాల్గొన్నాయి. యుద్ధం వల్ల బాంబులు పడి, గ్యాస్ లీక్, షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటే ఎలా బయటపడాలో వివరించారు. బాంబులు, ఇతర పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే విధానాన్ని కూడా వివరించారు. పై అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడం, క్షతగాత్రులను అక్కడి నుంచి కిందకు దించడం, వారికి వైద్య సహాయాన్ని అందించడం, హుటాహుటిన అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి తరలించడం, , సహాయ చర్యలు చేపట్టడం వంటి అంశాలను ప్రత్యక్షంగా డ్రిల్ చేసి చూపించారు. ప్రకృతి వైపరీత్యాలతోపాటు, మానవ ప్రేరేపిత ప్రమాదాలను సైతం ఎదుర్కొనే విధానాన్ని వివరించి, అధికారులు తమ సన్నద్ధతను తెలియజేశారు.
అప్రమత్తతే శ్రీరామరక్ష
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అదే మనను విపత్కర పరిస్థితుల నుంచి కాపాడుతుందని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. మాక్‌డ్రిల్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంత పెద్ద జనాభా గల అపార్ట్‌మెంట్లలో విపత్తుల నుంచి ఎలా బయటపడాలో వివరించారన్నారు. ఇన్‌చార్జి ఆర్డీవో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో శాంతిప్రభ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఆర్.వెంకటరమణ, ఎన్డీఆర్‌ఎఫ్. ఇన్‌స్పెక్టర్ సుశాంత్ కుమార్, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

ఉగ్రదాడులను ఎదుర్కొందామిలా..