
రచ్చకెక్కిన విభేదాలు
● దేవరాపల్లి మండల కమిటీ ఎన్నికలో భగ్గుమన్న అసమ్మతి సెగలు ● ఎమ్మెల్యే బండారు ముందే కుమ్ములాటకు దిగిన కార్యకర్తలు ● వలస నేతలపై పార్టీలో పాత కాపుల గుర్రు
దేవరాపల్లి: మండల టీడీపీ నేతలు వర్గ విభేదాలతో కుమ్ములాటకు దిగి రచ్చకెక్కారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సాక్షిగా పరస్పర దూషణలతో బాహాబాహీకి దిగారు. దేవరాపల్లిలోని రైవాడ అథితి గృహం వద్ద బుధవారం జరిగిన టీడీపీ సంస్థాగత ఎన్నిక వేదికగా కార్యకర్తలు గొడవ పడ్డారు. దీంతో ఈ సమావేశం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. స్థానిక ఎస్‌ఐ టి.మల్లేశ్వరరావు, సీఐ పైడపునాయుడు దగ్గరుండి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పాత టీడీపీ నేతలు, సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వలస నేతల మధ్య ఆధిపత్య పోరు ఈ వివాదానికి కారణంగా చెబుతున్నారు. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేదికగా చేసుకొని ఎమ్మెల్యే సమక్షంలో ఇరువర్గాలు వాగ్వివాదానికి దిగారు. తొలి నుంచీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు కొందరు ఎమ్మెల్యే ఎదుటే తమ అసంతృప్తిని వెళ్లగెక్కారు. దీంతో ఎమ్మెల్యే సహనం కోల్పోయి కొన్ని గ్రామాల నాయకులపై చిందులు తొక్కారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సహా పార్టీ పరిశీలకుడి ముందు కార్యకర్తలు బాహాబాహీకి దిగడానికి సిద్ధపడగా అక్కడే ఉన్న స్థానిక ఎస్‌ఐ మల్లేశ్వరరావు, సీఐ పైడపునాయుడు ఇతర పోలీస్ సిబ్బంది అడ్డుకొని సర్దిచెప్పారు.
ఎమ్మెల్యేతో కలిగొట్ల నేతల వాగ్వాదం
ప్రధాన కార్యదర్శిగా పదవి పేరు ప్రకటన సమయంలో ఒకే వ్యక్తికి పదవులు కట్టబెట్టడంపై ఎమ్మెల్యేతో కలిగొట్ల గ్రామానికి చెందిన కొందరు నేతలు వాదనకు దిగారు. ఈ సమయంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఎదురించే వారిని తాను లెక్క చేయనని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఆగ్రహించడంతో పార్టీ శ్రేణులు తీవ్ర విస్మయానికి గురయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగు దేశం జెండాను మోసిన వారిని కాదని, వలస నేతలకు ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నేతలు కొందరు గుర్రుగా ఉన్నారు. కుమ్ములాటలు, దూషణల నడుమ టీడీపీ మండల అధ్యక్షుడిగా ఎ.కొత్తపల్లి పెద్దాడ వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా కలిగొట్ల దొగ్గ దేముడునాయుడు పేర్లను ఎమ్మెల్యే, పార్టీ పరిశీలకుడు ప్రకటించారు. వర్గ విభేదాల నేపథ్యంలో రైవాడ, బోయిలకింతాడ, మారేపల్లి, కాశీపురం గ్రామ కమిటీ ఎన్నిక ప్రక్రియను వాయిదా వేశారు.

రచ్చకెక్కిన విభేదాలు