
అల్లూరి పార్కు అభివృద్ధికి ప్రణాళిక
● త్వరలో పనులు ప్రారంభం ● స్పీకర్ అయ్యన్నపాత్రుడు
గొలుగొండ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పార్కును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆయన బుధవారం పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్కు అభివృద్ధికి సహకరించమని ఇప్పటి వరకు 10 మంది ఎంపీలతో మాట్లాడానని, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు రూ.10 లక్షలు, నెల్లూరి ఎంపీ మస్తాన్‌రావు రూ.10 లక్షలు ఇవ్వగా మరో 8 మంది ఎంపీలు త్వరలో నిధులు కేటాయించనున్నారని తెలిపారు. పార్కులో సోలార్ సిస్టమ్, భోజనశాల, మరుగుదొడ్లు, పార్కు చుట్టూ లైటింగ్, తాగునీరు ఏర్పాటు చేసి, శిథిలమైన భవనాలకు మరమ్మతులు చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ టూరిజం నుంచి నిధులు కూడా తీసుకువస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీ టూరిజం అధికారులు విజయభాస్కరరెడ్డి, సీతారాం, సత్యనారాయణ, టూరిజం మేనేజర్ అప్పలనాయుడు, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ పాల్గొన్నారు.