
ఉద్దండపురంలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి
● ప్రత్యర్థులు కొట్టడం వల్లే చనిపోయిందని కుటుంబీకుల ఫిర్యాదు ● కేసు నమోదు చేసిన పోలీసులు
నక్కపల్లి : మండలంలో ఉద్దండపురం గ్రామంలో ఆవాల లక్ష్మి (60) అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా మరణించింది. తన తల్లి మరణానికి తనతో గొడవపడిన వ్యక్తులే కారణమని, తనను తన తల్లిని తీవ్రంగా గాయపరచడం వల్లే అనారోగ్యానికి గురై మరణించిందని మృతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ సన్నిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే ఉద్దండపురం గ్రామానికి చెందిన అవాల సురేష్ మార్నింగ్ స్టార్ బస్సులో, ఇదే గ్రామానికి చెందిన వెలం శెట్టిశ్రీను షామోలి బస్సులో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా సురేష్ తాను పనిచేసే బస్సులో మానేసి షామోలి బస్సులో పనిచేసేందుకు హైదరాబాద్ బయలు దేరాడు. ఈ విషయం తెలుసుకున్న వెలం శెట్టి శ్రీను షామోలి బస్సులో క్లీనర్‌గా పనిచేస్తున్న కుర్ర సాయికి ఫోన్ చేసి ఆవాల సురేష్ గురించి దుర్భాషలాడాడు. ఈ విషయం తెలిసిన సురేష్, శ్రీనుతో ఫోన్‌లో గొడవపడ్డాడు. ఈనెల 4వ తేదీన ఇరువర్గాలు గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టుకుని బాహాబాహీకి తలపడ్డారు. ఈ ఘర్షణలో వెలంశెట్టి శ్రీను అతని కుటుంబ సభ్యులు సురేష్, అతని తల్లిపై దాడి చేసి గాయపరిచారు. దీంతో సురేష్ తల్లి తీవ్ర అస్వస్థతకు గురయింది. కడుపులో నొప్పి రావడంతో ఏడో తేదీన నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం తునిలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నయం కాకపోవడంతో అక్కడ నుంచి విశాఖలో కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో వృద్ధురాలు మరణించింది. దీంతో తన తల్లి మరణానికి వెలం శెట్టి శ్రీను, అతని కుటుంబ సభ్యులు దాడి చేయడమే కారణమని వారు కొట్టడం వల్లే తన తల్లి అనారోగ్యానికి గురై మరణించిందని మృతురాలు కుమారుడు ఆవాల సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు కేజీహెచ్‌కు పంపిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. నక్కపల్లి ఆస్పత్రిలో ఉన్న లక్ష్మి మృతదేహాన్ని సీఐ కుమార స్వామి పరిశీలించారు. బాధిత కుటుంబీకుల నుంచి వివరాలు సేకరించారు. శ్రీను కుటుంబ సభ్యులు దాడి చేయడం వల్లే లక్ష్మి మరణించిందని వైద్యులు ధ్రువీకరిస్తే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

ఉద్దండపురంలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి