వ్యక్తిత్వ హననం చేసి.. | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిత్వ హననం చేసి..

Apr 29 2023 6:16 AM | Updated on Apr 29 2023 6:16 AM

యువతి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష

చోడవరం రూరల్‌: ఇరుగు పొరుగు వారై ఉండి చిన్నపాటి గొడవలో యువతి వ్యక్తిత్వ హననం చేసిన నేరానికి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వర్తనాపల్లికి చెందిన ముగ్గురు నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ స్థానిక అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి సత్తి అరుణశ్రీ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్‌ తరపున వాదనలు వినిపించిన అదనపు పీపీ వేచలపు వెంకటరావు వివరాల ప్రకారం... 2021 నవంబరు 28న పాడేరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని వర్తనాపల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారు సోనీ శివరామకృష్ణ చెల్లెలు గాయత్రి ఉదయం 11 గంటలకు ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొరుగు ఇంటి వారైన నిందితులు మోసే చంద్రకళ, మోసే నాగమణి, కంబడి శివశంకర్‌ తన చెల్లిని మానసిక వేదనకు గురి చేశారని, ఆమె వ్యక్తిత్వాన్ని తూలనాడారని, ఈ అవమానం భరించలేక చనిపోయిందంటూ పాడేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అప్పటి ఎస్‌ఐ జి.లక్ష్మణరావు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు ముందు వారం రోజులుగా తమ ఇంటిపైకి వాడక నీరు వస్తుందని, మృతురాలితోపాటు ఆమె తల్లితోనూ నిందితులు గొడవలు పడ్డారు. దాంతో ఫిర్యాదుదారు తండ్రి మురుగునీరు సక్రమంగా పోయేలాగా మరమ్మతులు చేయించాడు. అయినప్పటికీ అదే నెల 27వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో నిందితుల ఇంటి ముందు ఫిర్యాదీ కారు అడ్డంగా నిలిపారంటూ గాయత్రి, ఆమె తల్లితో గొడవకు దిగారు. గాయత్రిని నోటికి వచ్చిన రీతిలో దూషించడమేగాకుండా ఆమెకు లేనిపోని సంబంధాలు అంటగట్టారు. మరుసటిరోజు ఉదయం 10 గంటల సమయంలోనూ ఇదే రీతిలో ప్రవర్తించగా, గాయత్రిని తల్లి సముదాయించి మేకలను మేపడానికి వెళ్లిపోయింది. అటు తర్వాత గాయత్రి మనసు గాయపడటంతో 11 గంటల సమయంలో చీరతో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయింది. ఆమెను ఆత్మహత్మకు ప్రేరేపించారని నిందితులుపైనా ఐపీసీ 306 రెడ్‌ విత్‌ 34 సెక్షన్‌ కింద నేరాభియోగ పత్రాన్ని మోపారు. కేసు పూర్వాపరాలను, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించాక నేరం రుజువు కావడంతో అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి పైవిధంగా తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement