యోగ, ధ్యానం.. ఆరోగ్యభాగ్యం

మౌలిక సదుపాయాల కల్పనపై జరిగిన చర్చలో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులు - Sakshi

ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిత.. అనే నినాదంతో జీ– 20 పగ్గాల్ని చేపట్టిన భారతావని ప్రతిష్టను ఇనుమడింపజేసేలా విశాఖలో రెండో రోజు సదస్సు విజయవంతంగా జరిగింది. బుధవారం ఉదయం ఆరోగ్య సంరక్షణతో మొదలై.. మౌలిక సదుపాయాల కల్పన చర్చతో సదస్సు ముగిసింది. సాగరతీరంలో విదేశీ ప్రతినిధులు యోగాసనాలు వేశారు. మెడిటేషన్‌ చేశారు. అనంతరం మౌలిక సదుపాయాల కల్పనపై జీ–20 దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు.

సాక్షి, విశాఖపట్నం : జీ–20 సదస్సు రెండో రోజులో భాగంగా మొదటి సెషన్‌ సూర్యోదయం సమయంలోనే ప్రారంభమైంది. మెదడు, శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకునేందుకు ప్రతి రోజూ యోగా, ధ్యానం ప్రతి ఒక్కరికీ అవసరమని చాటి చెప్పేందుకు విదేశీ ప్రతినిధులు యోగా, మెడిటేషన్‌ కార్యక్రమాలు నిర్వహించారు. రాడిసన్‌ బ్లూ హోటల్‌ సమీపంలోని సాగరతీరంలో నిపుణుల పర్యవేక్షణలో విదేశీ ప్రతినిధులు యోగా చేశారు. అనంతరం మెడిటేషన్‌ చేపట్టారు. ఈ సందర్భంగా పౌష్టికాహార వినియోగం వల్ల ఆరోగ్యానికి ఒనగూరే ప్రయోజనాలను వారికి నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో 14 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అల్పాహారం అనంతరం మౌలిక సదుపాయాల కల్పన అనే అంశంపై ప్రధాన సమావేశం ప్రారంభమైంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హబ్‌ల భవిష్యత్‌పై ప్రతినిధులు చర్చించారు. మౌలిక సదుపాయాల కల్పనలో నగరాలను ప్రోత్సహిస్తూ.. వారిని భాగస్వాములు చేయడం, పెట్టుబడులు వచ్చే మార్గాలను మెరుగుపరచడం మొదలైన అంశాలపై దృష్టి సారిస్తూ సుదీర్ఘ చర్చలు జరిగాయి. చివరి సెషన్‌లో అర్బన్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఫ్రేమ్‌వర్క్‌ను ఎలా అభివృద్ధి చేయాలి, ఇన్‌ఫ్రాట్రాకర్‌ 2.0ని మెరుగుపరిచే అంశాలపై టెక్నికల్‌ సెషన్స్‌ కూడా నిర్వహించారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌(ఐడబ్ల్యూజీ)కి ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ దేశాల ప్రతినిధులు సహ అధ్యక్షులుగా వ్యవహరించి సదస్సును నడిపించారు.

నేడు క్షేత్రస్థాయి పరిశీలన

సదస్సులో మూడో రోజైన గురువారం ఉదయం 10 గంటల నుంచి 1.30 వరకు కెపాసిటీ బిల్డింగ్‌ వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు. అనంతరం జీ–20 దేశాల ప్రతినిధుల క్షేత్ర స్థాయి పర్యటనలు ఉంటాయి. ఇందులో భాగంగా ముడసర్లోవ, కాపులుప్పాడ ప్రాంతాల్లో విదేశీయుల పర్యటించనున్నారు. స్మార్ట్‌వాటర్‌ మేనేజ్‌మెంట్‌, మెగా ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌, జిందాల్‌ నిర్వహిస్తున్న వేస్ట్‌ టు ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌లను సందర్శించనున్నారు. అనంతరం పలు సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

రెండో రోజు కొనసాగిన జీ–20 సదస్సు

సాగరతీరంలో విదేశీ ప్రతినిధుల యోగాసనాలు

మౌలిక సదుపాయాల కల్పనపై

విస్తృత చర్చలు

నేడు సందర్శన ప్రాంతాల్లో

క్షేత్రస్థాయి పర్యటన

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top