
వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేకల హనుమంతు
అనకాపల్లి రూరల్: సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేకల హనుమంతు అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ వలన ప్రజలందరికీ సుమారు 520కి పైగా సేవలు గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం అనకాపల్లి మండల పరిషత్ కార్యాలయానికొచ్చిన ఆయన వివిధ పథకాల అమలు తీరు గురించి ఎంపీపీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. ఎన్నో సంస్కరణలతో సీఎం జగన్ పంచాయతీరాజ్ విభాగాన్ని పటిష్టపరిచారని, మరోసారి ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించాల్సిన అవసరం, బాధ్యత అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షుడు, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన మేకల హనుమంతును అనకాపల్లి, యలమంచిలి ఎంపీపీలు గొర్లి సూరిబాబు, బోదెపు గోవింద్, పార్టీ నేతలు సత్కరించారు. తర్వాత మేకల హనుమంతు జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై న అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, మూడు జిల్లాల పంచాయతీరాజ్ విభాగం ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించబడిన యలమంచిలి ఎంపీపీ బోదెపు గోవింద్‌లను మేకల హనుమంతు దుశ్శాలువ, పుష్ప గుచ్ఛాలతో సత్కరించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఇప్పట్నుంచే కృషి చేయాలని ఆయన కోరారు. మరోసారి వైఎస్ జగన్‌ను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని, ఇప్పటి సంస్కరణల ఫలాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందుతాయని నేతలు అభిప్రాయపడ్డారు. జిల్లాకు చెందిన పలువురు ఎంపీపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.