
రోడ్డు నిర్మాణానికి సిద్ధం చేసిన కంకర, పిక్క
బొజ్జన్నకొండకు మహర్దశ
తుమ్మపాల: ప్రాచీన సంపద బొజ్జన్నకొండ. బౌద్ధారామంగా ఎంతో గుర్తింపు పొందింది. కానీ ఒక్క కనుమ రోజున మాత్రమే ప్రజలకు గుర్తుకొస్తుంది. ఆరోజున అక్కడ జరిగే తీర్థానికి ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి వేలాదిగా జనం వస్తారు. మిగతా రోజుల్లో వెలవెలబోతుంది. పర్యాటక ప్రాంతంగా ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎక్కడైనా ప్రగతి పరవళ్లు తొక్కాలంటే ముందు మంచి రహదారి సౌకర్యం ఉండాలి. అందుకే రూ.1.5 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి పాలకులు, అధికారులు శ్రీకారం చుట్టారు.
నెరవేరనున్న చిరకాల వాంఛ
అనకాపల్లి మండలం శంకరం రెవెన్యూ పరిధిలో బొజ్జన్నకొండ ఉన్నప్పటికీ శంకరం–తుమ్మపాల గ్రామాల మధ్యలో ఉండటంతో రెండు గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడకు రాకపోకలు సాగిస్తున్నారు. అనకాపల్లి–చోడవరం రహదారిలో తుమ్మపాల నుంచి ఏలేరు కాలువ మీదుగా రెండేళ్ల క్రితం రెండు కిలోమీటర్ల పొడవున బొజ్జన్నకొండకు రహదారి నిర్మించారు. అయితే అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారి మీదుగా శంకరం వద్ద ఏలేరు కాలువ గుండానే అధికంగా సందర్శకులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గంలో రహదారి శిథిలావస్ధకు చేరడంతో అనేక ప్రజాసంఘాలు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశాయి. అయినా ఫలితం లేకపోయింది. ఇన్నాళ్లకు ఆ సంకల్పం నెరవేరబోతోంది. ఎంపీ డాక్టర్ బి.వి.సత్యవతి, కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి ప్రత్యేక చొరవతో బీటీ రోడ్డు నిర్మాణానికి బీజం పడుతోంది.
మూడు నెలల్లో పూర్తి చేసేలా..
రానున్న మూడు నెలల్లో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రోడ్డు పనులు మొదలు పెట్టేందుకు మంగళవారం నుంచి కంకర, పిక్క వంటి వనరులను రోడ్డుపై నిల్వ చేస్తున్నారు. శంకరం వద్ద ఏలేరు కాలువ జంక్షన్ నుంచి బొజ్జన్నకొండ వరకు తుమ్మపాల రోడ్డును కలుపుతూ వెయ్యి 50 మీటర్ల పొడవు గల రోడ్డును నిర్మించనున్నారు. అనకాపల్లి–ఆనందపురం రహదారి ఆనుకుని ఏలేరు కాలువ గుండా బీటీ రోడ్డు నిర్మించి అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇందుకు రూ.1.5 కోట్లు ఖర్చవుతుందని లెక్కలు వేశారు. ఎంపీ సత్యవతి ఎంపీ నిధుల నుంచి రూ.40 లక్షలు విడుదల చేశారు. కలెక్టర్ దృష్టి సారించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధుల కింద పలు పరిశ్రమలు మిగతా మొత్తాన్ని సమకూర్చేలా చర్యలు తీసుకున్నారు. మూడు నెలల్లోనే ఈ రహదారిని అందుబాటులోకి తెచ్చేలా పనులు శరవేగంగా జరిపిస్తామని పంచాయతీరాజ్ ఈఈ ఎస్.వి.నాయుడు చెప్పారు.
గ్రీనరీ, వాకింగ్ ట్రాక్‌తో రోడ్డు నిర్మాణం
జాతీయ రహదారి నుంచి బొజ్జన్నకొండకు గ్రీనరీ, వాకింగ్‌ట్రాక్‌తో రోడ్డు నిర్మాణం చేపడుతున్నాం. ఇందుకు ఎంపీ నిధుల నుంచి రూ.40 లక్షలు విడుదల చేశాను. మంత్రి గుడివాడ అమర్‌నాథ్, కలెక్టర్ సహకారంతో బొజ్జన్నకొండ అభివృద్ధిలో భాగంగా రోడ్డు పనులు వేగంగా జరిపేలా చర్యలు చేపడుతున్నారు. పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందేందుకు నా వంతు కృషి చేస్తాను.
–డాక్టర్ బి.వి.సత్యవతి, ఎంపీ
బొజ్జన్నకొండకు రూ.1.5 కోట్లతో రహదారి నిర్మాణం
శంకరం నుంచి వెయ్యి మీటర్ల బీటీ రోడ్డు
మూడు నెలల్లో
పూర్తి చేసేందుకు చర్యలు

