
● ప్రగతి, సంక్షేమాల్లో అగ్ర పీఠం వారికే.. ● చరిత్రలో నిలిచిపోయే ఆదర్శ పాలన ● మాడుగులను మోడల్‌గా తీర్చిదిద్దుతా.. ● వైఎస్సార్ ఆసరా సభలో డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు
మాడుగుల: రాష్ట్రంలో ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం నిర్దేశించుకున్నారని, అందులో భాగంగానే వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి, జగనన్న ఇల్లు, తదితర పథకాలను అమలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీఎంగా దేశ చరిత్రలో నిలిచిపోతారన్నారు. వైఎస్సార్ ఆసరా మూడో విడత చెక్కు పంపిణీకి డ్వాక్రా మహిళలతో మంగళవారం మాడుగులలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. తండ్రి వైఎస్సార్ బాటలో నడుస్తూ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. మాడుగుల నియోజకవర్గ ప్రజలు జగనన్న కుటుంబంగా ఏర్పడ్డారని, ఎ ప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ మాడుగుల కోటపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. మా డుగులను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా నని హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకున్నాయని, ఇప్పు డు వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే పథకాలు చేరుతున్నాయన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వ ల్ల వడ్డాది–తాటిపర్తి ప్రధాన రహదారి నిర్మాణం ని లిచిపోయిందని, రీటెండరు పిలిచి, కింతలి రోడ్డుకు కూడా నిధులు మంజూరు చేసి త్వరలో ఈ రెండు రోడ్లు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మాడుగుల మండలం డ్వాక్రా సంఘాలలో 15,182 మంది సభ్యులకు రూ.10 కోట్ల 81 లక్షల నమూనా చెక్కును ముత్యాలనాయుడు అందజేశారు.
మహిళలకు పెద్ద పీట
ఉత్తరాంధ్ర జిల్లాల సచివాలయ కన్వీనర్ హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. డ్వాక్రా రుణమాఫీ హామీని చంద్రబాబు విస్మరిస్తే, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆసరా పథకంతో ఆదుకున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఈర్లె అనురాధ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలలో, చట్టసభలలో మహిళలకు పెద్ద పీట వేసిన మహానుభావుడు సీఎం జగన్ అని కొనియాడారు. ఎంపీపీ వేమవరపు రామధర్మజ, వైస్ ఎంపీపీ తాళ్ళపురెడ్డి వెంకట రాజారామ్ మాట్లాడారు. డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీపతి, తహసీల్దార్ పీవీ రత్నం, ఐసీడీస్ పీవో శ్రీదేవి, రాష్ట్ర తూర్పుకాపు సంక్షేమ సంఘ డైరెక్టర్ గొళ్ళవిల్లి ప్రభావతి, జెడ్పీటీసీ కిముడు రమణమ్మ, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ శేనాపతి కొండలరావు, ఎంపీటీసీలు పొలిమేర విజయలక్ష్మి, కుక్కర మహేశ్వరి, కోఆప్షన్ మెంబర్ షేక్ ఉన్నీసా బేగం, సర్పంచ్‌లు ఎడ్ల కళావతి, గొళ్ళవిల్లి సంజీవరావు, కాళింగ కళ్యాణరాజు, కొసిరెడ్డి కృష్ణమూర్తి, తాళ్ళపురెడ్డి రాంబాబు, పీఏసీఎస్ అధ్యక్షుడు బొద్దపు భాస్కరరావు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న స్టాల్స్
ఆసరా సభ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. దేశవాళీ గోజాతి పెంపకం, ఐసీడీఎస్ ద్వారా చిరు ధాన్యాలతో చేసిన పిండి వంటలు, మహిళా మార్టులు తదితర స్టాల్స్‌ను అతిథులు పరిశీలించారు. గర్భిణులకు సీమంతం నిర్వహించారు. వారిని డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ఆశీర్వదించారు.
వైఎస్సార్ ఆసరా నమూనా చెక్కును స్వయంసహాయక సంఘాల సభ్యులకు అందజేస్తున్న డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, (కింది చిత్రం) ఆసరా సభకు హాజరైన డ్వాక్రా సంఘాల సభ్యులు
