సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం డిమాండ్
పాడేరు: బాకై ్సట్ తవ్వకాలు, 1/70 చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్లూరి జిల్లాలోని విలువైన ఖనిజాలను ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పేరుతో కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. జర్రెల బాకై ్సట్ కొండల్లో మట్టి నమూనాల సేకరణ, హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న సర్వేలపై కలెక్టర్‌కు తెలియకపోవడం ఆశ్చర్యకరమన్నారు. పర్యావరణ విధ్వంసానికి దారితీసే బాకై ్సట్ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. 1/70 చట్టం రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం గిరిజనులను మోసం చేయడమేనని లోకనాథం ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నంబరు 3 పునరుద్ధరణ హామీని ప్రభుత్వం విస్మరించిందని, డీఎస్సీలో గిరిజన నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. గత ఏడాది నిర్వహించిన డీఎస్సీలో జిల్లా ఏజెన్సీలో గిరిజన నిరుద్యోగులకు ఏకంగా రెండు వేల ఉద్యోగాలు కల్పించామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్‌కుమార్ అబద్దపు మాటలు చెప్పారన్నారు. ఏజెన్సీలో ఎపిడమిక్ సీజన్ దృష్ట్యా జ్వరాలు మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలు విజృంభిస్తున్నాయని కానీ వైద్యారోగ్య శాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు ఏ మాత్రం కూడా నష్ట నివారణ చర్యలు తీసుకోవడం లేదన్నారు. జిల్లాలో సర్ ప్రక్రియ అంత గందరగోళంగా ఉందన్నారు. సర్ ప్రక్రియపై గిరిజనులకు అవగాహన లేకపోవడంతో ఎంతో విలువైన ఓటును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. గిరిజన ప్రాంతంలో పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని గ్రామసభలు నిర్వహించి గ్రామ సభ ఆమోదంతో ఓటర్ సవరణ పక్రియ చేపట్టాలన్నారు. గిరిజన ప్రాంతంలో బాకై ్సట్ అంశం, 1/70 చట్టం అమలు, జీవో నంబర్3పై సీఎం చంద్రబాబు పూర్తి స్పష్టత ఇచ్చిన తరువాతే అగస్టు 9న రంపచోడవరంలో నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి హాజరు కావాలని లేని పక్షంలో గిరిజనులు, గిరిజన, ప్రజా, విద్యార్థి సంఘాలు, సీపీఎం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొవాల్సి వస్తుందని, ఆయన పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పి. అప్పలనర్స, అనంతగిరి జెడ్పీటీసీ దూసురి గంగరాజు, సీపీఎం నేత హైమవతి పాల్గొన్నారు.


