● తల్లిదండ్రుల డిమాండ్
● పాఠశాల వద్ద ఆందోళన
జి.మాడుగుల: మండలంలో కొత్తగా ఏర్పాటైన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వెంటనే తరగతులు ప్రారంభించాలని కోరుతూ మంగళవారం తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రామకృష్ణ, లక్ష్మి, సుజాత, మాధవరావు మాట్లాడుతూ.. పాఠశాలలు తెరిచి నెల రోజులు గడుస్తున్నా, కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇప్పటివరకు తరగతులు ప్రారంభం కాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యార్థులకు ఈ దుస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అరకొర వసతులతోనే నెట్టుకొస్తున్నామని, సొంత భవనం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సరైన త్రాగునీరు, మరుగుదొడ్లు, తగినన్ని తరగతి గదులు లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారని, పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా ఏకలవ్య పాఠశాలల తీరు ఉందని విమర్శించారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిందని వారు మండిపడ్డారు. ఇప్పటికై నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు కలెక్టర్, ఐటీడీఏ పీవో, సంబంధిత అధికారులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించి, వెంటనే తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


