రూ.2 కోట్ల ఖర్చు.. రెండేళ్లుగా ఎదురు చూపులు | - | Sakshi
Sakshi News home page

రూ.2 కోట్ల ఖర్చు.. రెండేళ్లుగా ఎదురు చూపులు

Jul 8 2026 12:56 AM | Updated on Jul 8 2026 12:56 AM

● కేజీబీవీ హాస్టల్‌ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా ● బీటలు వారుతున్న వసతి గృహం ● చుట్టూ పెరిగిన తుప్పలు

బుచ్చెయ్యపేట : మేజర్‌ పంచాయతీ వడ్డాది కేజీబీవీ వసతి గృహ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా పడింది. సుమారు రూ.రెండు కోట్లతో వడ్డాది కోవెల అప్పనదొర జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ పక్కనే 9వ తరగతి నుంచి ఇంటర్‌ చదువుతన్న విద్యార్థినుల కోసం నిర్మించిన టైప్‌ –4 వసతి గృహాన్ని 2024 అక్టోబర్‌ 16వ తేదీన ప్రారంభించేందుకు శిలాఫలకం వేశారు. కూటమిలో ఉన్న కుమ్ములాటల వల్ల ఆగిపోయింది. దీంతో రెండేళ్లుగా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. మళ్లీ మంగళవారం ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు మంగళవారం సాయంత్రం ప్రారంభోత్సవానికి రావాలని సమాచారం ఆందించారు. దీంతో అందరూ హాజరయ్యారు. ఆఖరు సమయంలో ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు రావడం లేదని తెలిసి కేజీబీవీ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. టీడీపీలో ఎమ్మెల్యే రాజు, హౌసింగ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబుల మధ్య ఉన్న వర్గ పోరు కారణంగా మళ్లీ కేజీబీవీ ప్రారంభోత్సవం వాయిదా పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. సుమారు రూ.రెండు కోట్లతో కేజీబీవీ నిర్మాణం చేపట్టిన ప్రారంభోత్సవానికి ముందే గోడలు బీటలు వారుతున్నాయి. కేజీబీవీ నాణ్యతపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. కేజీబీవీ చుట్టూ తుప్పలు, డొంకలు పెరిగిపోయి ఉండగా శుభ్రం చేయకపోగా చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేయకుండానే ప్రారంభోత్సవం ఏర్పాట్లు చేయడంపై పలువురు మండిపడుతున్నారు. కేజీబీవీ పోస్టులు భర్తీపైనా పలు ఆరోపణలు చేస్తున్నారు. కూటమిలో నాయకుల మధ్యన కుమ్ములాటల వల్ల విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకం కలుగుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement