నెట్‌వర్క్‌ సమస్యతో సర్‌ ప్రక్రియకు ఆటంకం | - | Sakshi
Sakshi News home page

నెట్‌వర్క్‌ సమస్యతో సర్‌ ప్రక్రియకు ఆటంకం

Jul 8 2026 12:56 AM | Updated on Jul 8 2026 12:56 AM

● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అరకులోయ టౌన్‌: సెల్‌ నెట్‌వర్క్‌ సమస్యల కారణంగా ఓటర్ల నమోదు (సర్వే) ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లోని కొత్తభల్లుగుడ, సుంకరమెట్ట, పోతంగి, కించుమండ, రంగశీల సచివాలయాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు ప్రక్రియ పురోగతి, బీఎల్‌ఓల పనితీరు, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓటరు నమోదు ప్రక్రియలో బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై నిరుద్యోగ యువత, రాజకీయ పార్టీల నాయకులు ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు. బీఎల్వోలకు బీఎల్‌ఏలు సహకరించాలని, ఇంటింటి సర్వేలో సేకరించిన వివరాలతో కూడిన ఫారంలను ఈ నెల 10వ తేదీలోపు బీఎల్వోలకు అందజేయాలని, వారి నుంచి తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. సుంకరమెట్ట, కొత్తభల్లుగుడ పంచాయతీల్లో నెట్‌వర్క్‌ సమస్యను పరిష్కరించాలని పాడేరు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లానని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 10వ తేదీలోపు ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని కోరారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేలా కృషి చేస్తున్న కలెక్టర్‌ నిశాంతి.టి, జిల్లా యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement