దేవరాపల్లి: మండలంలోని కాశీపురానికి చెందిన డాక్టర్ ధుబిరెడ్డి అప్పలనాయుడు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఎన్‌యూలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యారు. సాధారణ వ్యవసాయ కూలి కుటుంబంలో జన్మించిన అప్పలనాయుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సవాళ్లను, ఒడిదుడుకులను అధిగమించి జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ), న్యూఢిల్లీలో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. 2015 సెప్టెంబర్‌లో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఆత్మారామ్ సనాతన్ ధర్మ కళాశాల అర్థశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులై విద్యార్థులకు బోధనతో పాటు పరిశోధన రంగంలో సేవలందించారు. అనంతరం జేఎన్‌యూలో స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఎంపికై ప్రస్తుతం బోధన, పరిశోధన, అకడమిక్ రంగాలలో విశేష సేవలందిస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు దేముడు, పైడితల్లమ్మ వ్యవసాయ కూలీలుగా పని చేసి కుటుంబాన్ని పోషించారు. అప్పలనాయుడు కాశీపురం ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5 వరకు, కొరువాడ, గోవాడ బీసీ సంక్షేమ హాస్టళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. దేవరాపల్లిలో ఇంటర్, విశాఖ ఏవీఎన్‌లో డిగ్రీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. 2004–2006 మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగంలో పీజీ, 2008–2012 మధ్య అదే విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ విద్యా, పరిశోధన ప్రాజెక్టులలో పని చేశారు. జేఎన్‌యూలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా అప్పలనాయుడు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


