పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ
పెదబయలు: విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపర్చాలని పాడేరు ఐటీటీఏ పీవో ఆదిత్య వర్మ అన్నారు. సోమవారం పెదబయలు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–1ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు గణితంలో చతుర్విద ప్రక్రియలను బోధించి, వారి నుంచి సమాధానాలు రాబట్టారు. చదవడం,రాయడం ప్రతీ విద్యార్థినికి వస్తుందో, లేదో ఆరా తీశారు. అనంతరం పాఠశాల టాయిలెట్స్‌ను, వసతి గృహంలో స్టాక్ రూమ్‌ను పరిశీలించారు.వసతి గృహం పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో వార్డెన్‌ను మందలించారు. పాఠశాల,వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతీ రోజు ఉదయం రెండు పీరియడ్లు కచ్చితంగా గణితం బోధించాలని ఆదేశించారు.
ఎన్యుమరేషన్ ప్రక్రియ వేగవంతం
‘సర్’ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని పీవో తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన ఎన్యుమరేషన్‌ను పరిశీలించారు. బీఎల్‌వోలు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్యాంసుందర్, తహసీల్దార్ లక్ష్మయ్య, గిరిజన సంక్షేమశాఖ సహాయ అధికారి స్వర్ణలత, మండల విద్యాశాఖ అధికారి కె.కృష్ణమూర్తి,హెచ్‌ఎం నారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


