అస్వస్థతతో కేజీబీవీ విద్యార్థిని మృతి | - | Sakshi
Sakshi News home page

అస్వస్థతతో కేజీబీవీ విద్యార్థిని మృతి

Jul 7 2026 1:19 AM | Updated on Jul 7 2026 1:19 AM

డుంబ్రిగుడ: హోమ్‌ సిక్‌తో సెలవుపై స్వగ్రామానికి వెళ్లిన కేజీబీవీ విద్యార్థిని అకస్మాత్తుగా అస్వస్థతకు గురై అరకులోయ ఏరియా ఆస్పత్రిలో మృతి చెందింది. మండలంలోని పోతంగి పంచాయతీ పెద్దపాడే గ్రామానికి చెందిన బడ్నాయిని లక్ష్మీదేవి(15) స్ధానిక కస్తుర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఈనెల 4వ తేదీన విద్యార్థిని తండ్రి బడ్నాయిని రామస్వామి పాఠశాలకు వెళ్లి హోమ్‌ సిక్‌పై సెలవు అడిగి గ్రామానికి తీసుకెళ్లాడు. శనివారం సాయంత్రం విద్యార్థిని అజీర్తితో బాధపడింది. ఆదివారం ఉదయం కూడా అదే పరిస్థితి ఉండటంతో పసర (పోదు)మందు రాశారు మధ్యాహ్నం హఠాత్తుగా అస్వస్థతకు గురవడంతో డుంబ్రిగుడ పీహెచ్‌సీకి తరలించారు. వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆదివారం సాయంత్రం అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఈవిషయంపై ఆ పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించగా తమ పాఠశాలలో ఆరో తరగతి నుంచి చదువుతోందని, ఎప్పుడూ అనారోగ్యానికి గురి కాలేదన్నారు. ఆదివారం సాయంత్రం బాధిత కుటుంబ సభ్యులు పాఠశాలకు సమాచారం అందించారని ఆపాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ పద్మ తెలిపారు. విద్యార్థిని మృతిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నామని ఆమె చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement