నిలిచిన లావాదేవీలు | - | Sakshi
Sakshi News home page

నిలిచిన లావాదేవీలు

Jul 7 2026 1:19 AM | Updated on Jul 7 2026 1:19 AM

రిజిస్టార్‌ కార్యాలయాల్లో లేఖర్ల పెన్‌డౌన్‌

రిజిస్ట్రేషన్లలో ప్రైవేటు ప్రక్రియతో అక్రమాలకు ఆస్కారం

కూటమి ప్రభుత్వం తీరుపై వైఎస్సార్‌సీపీ నేత వీసం ధ్వజం

నక్కపల్లి : రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రైవేటు పరం చేస్తూ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్‌ 396 రద్దు చేయాలంటూ దస్తావేజు లేఖర్లు నిరసన బాట పట్టారు. సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేశారు. దీంతో సోమవారం నక్కపల్లి సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో లావాదేవీలు నిలిచిపోయాయి. దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్‌కు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, వైస్‌ ఎంపీపీ వీసం నానాజీ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వీసం రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దాదాపు 550 రకాల ప్రభుత్వ సేవలను గ్రామాల్లోనే అందించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ సేవలతో పాటు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సచివాలయాల్లో నిర్వహించాలని నిర్ణయిస్తే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. దస్తావేజు లేఖర్ల ఉపాధి దెబ్బతింటుందని గగ్గోలు పెట్టిన పార్టీలు ఇప్పుడు అదే విధానాన్ని ఎందుకు అవలంబిస్తున్నారని ప్రశ్నించారు. నాటి జగనన్న ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను ప్రభుత్వ కార్యాలయాలైన సచివాలయాల్లో నిర్వహించాలని నిర్ణయించిందని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఈ ప్రక్రియను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల డేటా అంతా ప్రైవేటు ఏజెన్సీల చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. దీనివల్ల అనేక అక్రమాలు, అనర్థాలు జరిగే అవకాశం ఉందన్నారు. రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. సబ్‌ రిజిస్టార్‌ గోపీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. దస్తావేజు లేఖర్ల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు దాతారం మురళి, కొంగర కృష్ణ మాట్లాడుతూ మంగళవారం కూడా పెన్‌డౌన్‌ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, ఎంపీటీసీ గంటా తిరుపతిరావు, పార్టీ నాయకులు వీసం శ్రీను, బంగార్రాజు, దస్తావేజు లేఖర్లు యాళ్ల చిరంజీవి, వై.ఎస్‌.ఎన్‌.రాజు, గోవిందు, రమేష్‌ పాల్గొన్నారు.

నర్సీపట్నంలో...

నర్సీపట్నం: ప్రైవేటు రిజిస్ట్రేషన్‌ కేంద్రాల ఏర్పాటు చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డాక్యుమెంట్‌ రైటర్ల సంఘం అధ్యక్షుడు సున్నం చిదంబరం స్వామి డిమాండ్‌ చేశారు. రిజిస్ట్రేషన్‌ దస్తావేజు లేఖరులు పెన్‌డౌన్‌ చేపట్టి నల్లబాడ్జీలు ధరించి, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనకకు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ సేవలను ప్రభుత్వమే కొనసాగించాలన్నారు. ప్రజల ఆస్తుల భద్రత, హక్కుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అన్నారు. రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్‌ రైటర్ల సంఘం ఉపాధ్యక్షులు ఎం.సత్తిబాబు, కార్యదర్శి రుత్తల శివకుమార్‌, వాణి, నరం సన్యాసినాయుడు, డాక్యుమెంట్‌ రైటర్లు పాల్గొన్నారు.

యలమంచిలి రూరల్‌: జీవో నంబరు 396ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం యలమంచిలిలో దస్తావేజు లేఖరులు పెన్‌డౌన్‌ నిరసన తెలిపారు. పనులు కట్టిపెట్టి ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. డాక్యుమెంటు రైటర్ల సంఘం అధ్యక్షుడు నాగశేషు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది ఉపాధి కోల్పోతారన్నారు. డాక్యుమెంటు రైటర్లు విధులు బహిష్కరించడంతో కక్షిదారులు ఇబ్బంది పడ్డారు. రైటర్ల నిరసనతో నిత్యం జనంతో రద్దీగా ఉండే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం బోసిపోయింది. అధికారులు, సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. నిరసనలో సంఘం కార్యదర్శి శానాపతి రాము, పిల్లా నాగేశ్వర్రావు పాల్గొన్నారు.

చోడవరం: దస్తావేజు లేఖరులు విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు. చోడవరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద సోమవారం టెంట్‌ వేసి ధర్నా చేశారు. అనంతరం ఎమ్మెల్యే కేఎస్‌ ఎన్‌ఎస్‌ రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనలో చోడవరం దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు వడ్డాది రమేష్‌, గౌరవాధ్యక్షుడు సీతారామయ్య, ఉపాధ్యక్షుడు బొబ్బిలి చంద్రశేఖర్‌, కార్యదర్శి కోరుకొండ శ్రీనివాసరావు, పులగాయల నారాయణరావు, బొబ్బిలి రామారావు, కె. నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

కె.కోటపాడు: స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద లేఖరులు పెన్‌డౌన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జాయింట్‌ సెక్రటరీ శేఖర్‌మంత్రి శ్రీనివాసరావు, దస్తావేజు లేఖరుల జిల్లా కమిటీ మెంబర్‌ వడ్డాది రమేష్‌ మాట్లాడుతూ ప్రైవేట్‌ రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల ఏర్పాటుతో ప్రజలు విలువైన ఆస్తుల వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళితే భద్రత లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో ఈ నెల 14న చలో విజయవాడ చేపట్టనున్నట్లు తెలిపారు. దస్తావేజు లేఖరులు బొబ్డిలి సన్యాసిరావు, బొడ్డు దొరస్వామినాయుడు, దుంగల రమేష్‌, తొండవరపు రాజు, సీముసురు దేముడుబాబు, కోట అప్పలనాయుడు, రెడ్డి నాగేశ్వరరావు, కర్రి దేముడునాయుడు పాల్గొన్నారు.

దస్తావేజు లేఖర్లకు సంఘీభావం తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు వీసం తదితరులు

సబ్‌ రిజిస్టార్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు లేఖర్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement