పాయకరావుపేట: కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని, రైతులకు సకాలంలో వరి విత్తనాలు సరఫరా చేయడంలో విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ చిక్కాల రామారావు విమర్శించారు. మండల రైతులతో కలిసి ఆయన సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట వరి విత్తనాలు సమస్యపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిక్కాల రామారావు మాట్లాడుతూ గతేడాది రైతులకు నాణ్యమైన విత్తనాలు, సక్రమంగా ఎరువులు సరఫరా చేయకపోవడం వల్ల రైతులు ఎంతో నష్టపోయారన్నారు. ప్రస్తుతం 20 శాతం విత్తనాలు ఇంతవరకు సరఫరా జరగలేదన్నారు. పలుచోట్ల రైతు సేవా కేంద్రాలు మూతబడ్డాయన్నారు. రైతులకు వ్యవసాయ సిబ్బంది ఎక్కడా అందుబాటులో ఉండడం లేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో వరి విత్తనాలు, ఎరువులు సరఫరా చేశారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత అప్పటి సీఎం జగన్‌కే దక్కిందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ రైతు విభాగం కార్యదర్శి సూరకాసుల గోవిందు మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో రైతులకు ఏ విధంగా న్యాయం జరగడం లేదన్నారు. అంతకుముందు ఎంపీడీవో ఎ.లవరాజుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ లంక సూరిబాబు, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు గెడ్డమూరి శ్రీనివాసరావు, ధనిశెట్టి మహేష్, పార్టీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి పడాల గోవిందు, మండల రైతు విభాగం అధ్యక్షుడు కోనే పుత్రరావు, మాజీ సర్పంచ్ పన్నీరు బాబ్జి, ఎంపీటీసీలు కొంతం నరేష్, పల్లేల లక్ష్మణ్, ఎగదాసు శేఖర్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు వై.అన్నవరం, నాయకులు ఇసరపు తాతారావు, పందిరి ధర్మాజీ, కాకాడ కృష్ణ, చేపల తాతాజీ, పేపకాయల అప్పారావు, గర్లంక వెంకటసూరి, త్రిపర్ణ శ్రీను తదితరులు పాల్గొన్నారరు.


