పెందుర్తి : నడిచి వెళ్తున్న వృద్ధురాలిని అడ్రస్ అడిగే నెపంతో బురిడీ కొట్టించి, ఆమె మెడలోని బంగారు ఆభరణాలు అపహరించుకుపోయిన తల్లీకొడుకును పెందుర్తి క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.9 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైమ్ విభాగం ఏసీపీ ఎ.వెంకటరావు కేసు వివరాలను వెల్లడించారు.
స్కూటీపై వచ్చి స్కెచ్..
సుజాతనగర్‌కు చెందిన కిలపర్తి చెల్లయ్యమ్మ గత నెల 27న ద్వారకానగర్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం తిరిగి సుజాతనగర్‌లో బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా.. రామాటాకీస్ ప్రాంతానికి చెందిన మాదివాడ ధనలక్ష్మి, ఆమె కుమారుడు మాదివాడ అక్షిత్‌లు స్కెచ్ వేశారు. ముఖాలకు మాస్కులు ధరించి స్కూటీపై వృద్ధురాలిని వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను ఆపి, అడ్రస్ అడిగే నెపంతో నమ్మించారు. చెల్లయ్యమ్మ అడ్రస్ చెబుతున్న తరుణంలో.. ఒక్కసారిగా ఆమె మెడలోని పుస్తెలతాడు, నల్లపూసల దండను తెంచుకుని పరారయ్యారు.
పోలీసుల గాలింపు.. నిందితుల అరెస్ట్
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పెందుర్తి క్రైమ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.9 లక్షల విలువైన ఆభరణాలను రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించి ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ సీఐ ఎం.చంద్రమౌళి, ఎస్‌ఐ డి.సూరిబాబు, ఏఎస్‌ఐ జి.నాగరాజు, హెచ్‌సీ వి.పేరయ్యనాయుడు, పీసీలు టి.శివప్రసాద్, ఎస్.జానకిరామ్, జె.శ్యాంసుందరరెడ్డి, జి.శివకృష్ణ, ఎల్.కే తాతారావులను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.


