సంద్రమంత
గుండెలవిసేలా రోదిస్తున్న మహిళలు
గంగవరం సమీపంలో సుమారు 10 నాటికల్ మైళ్ల దూరంలో బోటు ప్రమాదం
సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం వారి కుటుంబాలు ఆందోళనగా ఎదురుచూస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విశాఖ తీరం గంగవరం సమీపంలో సుమారు 10 నాటికల్ మైళ్ల దూరంలో ఓ ఫిషింగ్ బోటు ప్రమాదానికి గురైంది. బోటులో మొత్తం ఏడుగురు మత్స్యకారులు ఉండగా, వారిలో బోటు యజమాని–డ్రైవర్ కారి చిన్నను విదేశీ సరుకు నౌక సురక్షితంగా రక్షించింది. మిగిలిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారిని గుర్తించేందుకు కోస్ట్ గార్డ్, నేవీ సంయుక్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
అల్లకల్లోలంగా సంద్రం
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న ఐఎన్‌డీ–ఏపీ–ఎంఎం–వి–583 నంబరు గల బోటు ఏడుగురు మత్స్యకారులతో వేటకు బయలుదేరింది. వేట సాగుతున్న సమయంలో అల్పపీడనం ప్రభావంతో సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. భారీ అలలు, బలమైన ఈదురుగాలుల కారణంగా బోటుకు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇంజిన్ పనిచేయకపోవడంతో పాటు బోటు నియంత్రణ కోల్పోయింది. అలల ధాటికి తాడు తెగిపోవడంతో బోటు సముద్రంలో కొట్టుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
బోటు యజమాని క్షేమం
బోటులో ఉన్న ఏడుగురిలో కారి చిన్నను పనామా దేశానికి చెందిన ఓ వాణిజ్య నౌక సురక్షితంగా రక్షించింది. జాయింట్ ఆపరేషన్స్ సెంటర్‌కు సమాచారం అందిన వెంటనే కోస్ట్ గార్డ్ చర్యలు చేపట్టి ఆయనను సురక్షితంగా తీరానికి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆయన నుంచి ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.
మిన్నంటిన కుటుంబాల రోదనలు
గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యుల ఆవేదన హృదయ విదారకంగా మారింది. ఆదివారం ఉదయం విశాఖ ఫిషింగ్ హార్బర్‌లోని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించి తమ వారిని సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మహిళలు కన్నీరు మున్నీరవుతూ అధికారులను వేడుకోవడం అక్కడ విషాద వాతావరణాన్ని నెలకొల్పింది.
కడలే వారికి కన్నతల్లి. అలలే వారికి బతుకు బాట. తుపాను హెచ్చరికలు లెక్కచేయకుండా, కుటుంబాల పొట్ట నింపేందుకు ఆ ఏడుగురు మత్స్యకారులు గంగమ్మ తల్లిని నమ్ముకుని సముద్రంలో అడుగు పెట్టారు. కానీ ఈసారి గంగమ్మ తల్లి కరుణించలేదు. బంగాళాఖాతంలో పుట్టిన అల్పపీడనం కన్నెర్ర చేయడంతో అలలు రెచ్చిపోయాయి, గాలులు బీభత్సం సృష్టించాయి. ఇంజిన్ ఆగిపోయి, తాడు తెగిపోయి బోటు కడలి కడుపులో కొట్టుకుపోయింది. ‘ఇంకో గంటలో ఇంటికి వస్తా’ అని చెప్పిన మాటలే ఆఖరి మాటలుగా మారాయి. భర్త కోసం రాత్రంతా వంట సిద్ధం చేసి ఎదురుచూసిన నరసయ్యమ్మ కళ్లు నీటి చెలమలు అయ్యాయి. బోటు యజమానిని ఒక విదేశీ నౌక కాపాడగా, గల్లంతైన ఆరుగురు కోసం ఆ కటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి.
– మహారాణిపేట
గాలింపు ముమ్మరం
భర్త కోసం తీవ్ర ఆందోళన
‘మరో గంటలో ఇంటికి వస్తానని నా భర్త ఫోన్ చేశారు. ఆయన కోసం వంట చేసి ఎదురు చూశాను. కానీ 24 గంటలు దాటినా ఇంకా రాలేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదు. నా భర్త ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు. దయచేసి ఆయనను సురక్షితంగా నాకు తీసుకురండి’అంటూ గల్లంతైన మత్స్యకారుడు కారి సీతోడు భార్య నరసయ్యమ్మ కన్నీరుమున్నీరయ్యారు. భర్త కోసం రాత్రంతా ఎదురుచూశానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మహారాణిపేట/బీచ్‌రోడ్డు: సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం నేవీ, కోస్ట్ గార్డ్, మైరెన్ పోలీసులు సంయుక్తంగా యుద్ధప్రాతిపదికన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఆదివారం విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, గల్లంతైన వారిని గుర్తించే వరకు గాలింపు నిరంతరంగా కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి కూడా బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.
రంగంలోకి నౌకలు, హెలికాప్టర్లు
బోటు చివరిసారిగా ఉన్న సిగ్నల్స్ ఆధారంగా నడిసముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. కాగా కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఐజీ గోపీనాథ్ జట్టి కోస్ట్ గార్డ్ కార్యాలయాన్ని సందర్శించి రెస్క్యూ ఆపరేషన్‌ను సమీక్షించారు. ప్రస్తుతం సహాయక చర్యల కోసం కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు నౌకలు, రెండు హెలికాప్టర్లు, అలాగే నేవీకి చెందిన ఒక నౌక సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నాయని ఆయన వెల్లడించారు


