చీడికాడ: సోలార్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో నాలుగు గ్రామాల రైతుల నుంచి బలవంతపు భూ సేకరణను ఆపాలని, అలాగే రైతులకు బలవంతంగా ఇచ్చిన నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, సోలార్ ప్లాంట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం బాధిత గ్రామాలైన బైలపూడి, చినగోగాడ, జి.కొత్తపల్లి, అడవి అగ్రహారం గ్రామాల రైతులతో కూడి ఆయా భూముల్లో గల పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతులకు మద్దతుగా పాల్గొన్న వీరు మాట్లాడుతూ 4 గ్రామాల పరిధిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు పేరిట 262 ఎకరాల భూమిని భూ సేకరణ చేస్తున్నట్టు గతంలో సంబంధిత రైతులకు నోటీసులు ఇవ్వడంతో తమ భూములను ప్లాంట్ ఏర్పాటుకు ఇవ్వమని ఇప్పటికే నోటిసులకు సమాధానం చెప్పినా తహసీల్దార్ అవి ప్రభుత్వ భూములని, మీకు పట్టాలున్నా రైతులకు ఏ హక్కులు ఉండవని బెదిరిస్తూ రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నారన్నారు. నాలుగు గ్రామాల్లో కలసి 262 ఎకరాల భూముల సేకరణ పేరిట రైతులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 40 ఏళ్ల క్రితమే సాగుదారులకు హక్కు పత్రాలు మంజూరు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీఈపీసిఎల్ ద్వారా 57.97 మెగా వాట్ల సోలర్ ప్లాంట్ నిర్మిచనున్నట్టు ప్రకటించిందన్నారు. ఈ భూముల్లో ఉన్న వందలాది మంది రైతు కుటుంబాలు పామాయిల్, నువ్వులు, వేరుశనగ పంటల ద్వారా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ యంత్రాంగం రైతులకు ఇష్టం లేకుండా భూముల సేకరణ పేరిట ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. 9–77 యాక్టు ప్రకారం రైతులు డీ–ఫారం భూములు అమ్మకాలు, కొనుగోలు జరిగాయని వీటిని తీసుకుంటామని రెవెన్యూ అధికారుల బెదిరింపులతో కుంగిపోతున్న రైతులు గుండెపోటుకు గురై మరణిస్తున్నారని, పలువురు మహిళా రైతులు భర్త మృతి చెందితే ఈ భూములని ఉపాధిగా చేసుకుని కుటుంబాలను సాకుతున్నారన్నారు. గ్రామ సభల్లోనే భూములు ఇవ్వమని చెప్పినా పట్టించుకోకుండా సేకరణ పేరిట ముందుకు వెళ్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వృత్తిదారుల సంఘం జిల్లా ఛైర్మన్ గంటా శ్రీరామ్, సీఐటీయు జిల్లా, మండల కార్యదర్శిలు ఆర్.రాము, ఆర్.దేముడునాయుడుతో పాటు మాజీ ఎంపీపీ కొల్లి అప్పలనాయుడు, గంటా మత్స్యరాజు, జాజిమొగ్గల రమేష్, సిహెచ్. శ్రీను, సన్యాసిరావు, సిరికి రాము, సలాది గంగశేషు,కొన ఈశ్వరరావు, మైచర్ల నానాజీ, కె.కన్నబాబుతో పాటు పెద్ద ఎత్తున మహిళా రైతులు పాల్గొన్నారు.


