మానవత్వాన్ని చాటుకున్న ఎస్పీ తుహిన్ సిన్హా
మాడుగుల రూరల్: చట్టాన్ని అమలు చెయ్యడంలోనే కాదు ఆపదలో వున్నప్పుడు మానవత్వాన్ని చాటడంలో తాము ఎప్పుడూ ముందే ఉంటామని అనకాపల్లి జిల్లా పోలీసులు నిరూపించారు. పిట్ ఎన్‌డీపీఎస్ చట్టం కింద విశాఖపట్నం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో వున్న నిందితుడు బుదిరెడ్ల కొండలరావు తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మానవతాదృక్పథంతో ఒక రోజు తాత్కాలిక బెయిల్ (పరోల్ ) మంజూరు చేయించడంలో అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం చూపిన చొరవపై సర్వత్రాపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఎస్‌ఐ జి. నారాయణరావు ఆదివారం రాత్రి స్థానిక విలేకరులకు అందించిన వివరాలిలా వున్నాయి. అనకాపల్లి జిల్లా, మాడుగుల మండలం, ఎం. కోటపాడు గ్రామానికి చెందిన బుదిరెడ్ల కొండలరావు గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉంటూ, ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశాల మేరకు 2025 జూలై 14 న పిట్ ఎన్‌డీపీఎస్ చట్టం కింద అరెస్టు అయి విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్ అనుభవిస్తున్నాడు. కాగా పది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న అతని తల్లి బుదిరెడ్ల పైడితల్లమ్మ (50) ఈ నెల 4 వ తేదీ శనివారం మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కన్నకొడుకు జైలులో ఉండడంతో ఆఖరి చూపు కూడా నోచుకోలేని దైన్యస్థితిలో ఆ కుటుంబం పుట్టెడు దుఖంలో మునిగిపోయింది. కన్నతల్లి చివరి చూపునకై నా కొడుకును తీసుకురావాలని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు జిల్లా పోలీసులను ఆశ్రయించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న వారు తక్షణమే ఈ విషయాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా , ఆదనపు ఎస్పీ పి.ఎల్.మోహన్‌రావుకు నివేదించారు. ఎస్పీ వెంటనే స్పందించి, ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ, సిఫార్సు మేరకు రెవెన్యూ, ఎక్సెయిజ్‌శాఖ వారు వెంటనే స్పందించి, అత్యవసరంగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిందితుడు బుదిరెడ్ల కొండలరావుకు ఒక రోజు పాటు తల్లి అంత్యక్రియలకు హాజరు అయ్యేందుకు తాత్కాలిక విడుదల మంజూరు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తగిన పోలీసు భద్రత నడుమ, కొండలరావు ఆదివారం ఎం. కోటపాడు గ్రామానికి చేరుకుని తన తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఎస్పీ తుహిన్‌సిన్హా, ఆదనపు ఎస్పీ మోహన్‌రావు, పోలీసు సిబ్బందికి కొండలరావు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.


