సబ్బవరం: అనకాపల్లి జిల్లా సబ్ జూనియర్ బాల బాలికల టెన్నీకాయిట్ జట్టు ఎంపికలు ఆదివారం సబ్బవరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించారు. ఈ నెల 11, 12వ తేదీలలో ప్రకాశం జిల్లా జరుగుమల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగే 38వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ టెన్నీకాయిట్ చాంపియన్ షిప్‌లో పాల్గొనే క్రీడాకారులను ఈ సందర్భంగా ఎంపిక చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన అనకాపల్లి జిల్లా టెన్నీకాయిట్ అసోసియేషన్ అధ్యక్షుడు రౌతు శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలతో పాటు చదువులోను ప్రతిభ కనబరిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. బాలుర విభాగంలో జె.సంపత్ వినయ్ కుమార్, కె.పండు, ఎం.కిశోర్, జి.నిఖిల్, వి.సూర్యదేవ, బాలికల విభాగంలో జి.వర్షిణి, పి.మంజు, వి.సృమైన, ఎ.కుసుమ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టెన్నీకాయిట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఎన్.వి.సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి జి.కనకరావు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్.కేశవరావు, వ్యాయామ ఉపాధ్యాయులు వి.సూర్యనారాయణ, మహాలక్ష్మి, భీమిలి ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల, రాజాం ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


