కశింకోట: కశింకోటలో జాతీయ రహదారిపై బస్సు, లారీతో పాటు వరుసగా మూడు వాహనాలు ఆదివారం సాయంత్రం ఢీకొన్నాయి. ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. బస్సు ముందు, వెనుక భాగాలు, దెబ్బతిన్నాయి. ప్రయాణికులు సురక్షితం. రాజమండ్రి నుంచి విశాఖ వెళుతున్న జేఎన్‌ఆర్‌ఎం ఏసీ ఆర్టీసీ మెట్రో బస్సు ముందు ఆగిన వ్యాన్‌ను ఢీకొంది. దీంతో బస్సును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. కశింకోట కూడలి వద్ద జరిగిన ప్రమాదంలో బస్సు వెనుక అద్దాలు పగిలిపోయాయి. ముందు అద్దం బీటలు వారి దెబ్బతింది. ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. వీరిని వేరే బస్సులో తరలించారు. ప్రమాదం వల్ల జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు బయ్యవరం వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహన చోదకులు ఇబ్బంది చెందారు. దీంతో సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మణరావు, సిబ్బంది క్రేన్ సహాయంతో అడ్డంగా ఉన్న బస్సును పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించారు.


