● నాలుగురోజులుగా ఈదురు గాలులు
● ఇళ్లకు పరిమితమవుతున్న గిరిజనులు
● ఎడతెరిపి లేకుండా వర్షాలు
● అల్లాడుతున్న ముంచంగిపుట్టు
పాడేరు: ఏజెన్సీ ప్రాంతాన్ని గత నాలుగు రోజులుగా వర్షాలు వణికిస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండటంతో గిరిజన ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎడతెరిపి లేని వానలతో ముసురు వాతావరణం నెలకొనగా, గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు.
అంధకారంలో ఏజెన్సీ
ఈదురుగాలుల తీవ్రతకు విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. తీగలపై చెట్లు పడటంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా శనివారం అర్ధరాత్రి నుండి పాడేరు, డుంబ్రిగుడ మండలాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో గడపాల్సిన పరిస్థితి తలెత్తింది.
కొనసాగుతున్న వాన
ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం ఏమాత్రం విరామం లేకుండా కురుస్తూనే ఉంది. రహదారులపై ట్రాఫిక్ తగ్గిపోవడంతో రోడ్లన్నీ వెలవెలబోయాయి. వర్షాల ప్రభావంతో రోజువారీ పనులు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే వ్యవసాయ పనులకు కూడా ఆటంకం కలిగే అవకాశం ఉందని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.
స్తంభించిన జనజీవనం
ముంచంగిపుట్టు: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంచంగిపుట్టు మండలంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎడతెరిపి లేని వానలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
పనసపుట్టు పంచాయతీ కేంద్రం వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఈదురుగాలులకు భారీ వృక్షం అడ్డంగా పడిపోవడంతో, ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు, డుడుమ మార్గాల్లో కొన్ని గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు శ్రమించి చెట్టును తొలగించడంతో వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. మరోవైపు, ముంచంగిపుట్టు నుంచి పెదబయలు వెళ్లే మార్గంలో విద్యుత్ స్తంభాలపై చెట్టు పడటంతో వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే స్పందించి చెట్టును తొలగించి, వైర్లను సరిచేశారు.
నీట మునిగిన పంట పొలాలు
మాకవరం, జోలాపుట్టు, దొడిపుట్టు, కర్రిముఖిపుట్టు, పనసపుట్టు పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో పంట పొలాల్లోకి భారీగా వరదనీరు చేరడంతో పంటలు నీట మునిగాయి. దీంతో గిరిజన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనుగుమ్మ పంచాయతీ తర్లాగూడ గ్రామానికి వెళ్లే మార్గంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీనివల్ల ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


