ఓటర్ల మౌనం! | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల మౌనం!

Jul 6 2026 12:46 AM | Updated on Jul 6 2026 12:46 AM

● తెరచుకోని పోలింగ్‌ కేంద్రాలు ● మందకొడిగా డిజిటిలైజేషన్‌ ● వర్షంతో ఓటర్లు ఇళ్లకే పరిమితం ● ఇంటింటికి తిరిగిన ఎన్నికల సిబ్బంది

జోరు వాన..
ఓటర్ల నమోదుపై ఆశలు.. వరుణుడి అడ్డంకులు! ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జిల్లాలో నీరుగారింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల జాడ లేకపోవడం, తోడుగా కురిసిన భారీ వర్షాలు ఈ ప్రక్రియను ముందుకు సాగనివ్వలేదు

సాక్షి, పాడేరు: ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు శని, ఆదివారాల్లో నిర్వహించాల్సిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జిల్లాలో ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల వద్ద సిబ్బంది పడిగాపులు కాయగా, ఓటర్ల స్పందన కరువైంది.

తెరచుకోని పోలింగ్‌ కేంద్రాలు

జిల్లాలోని అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాలు ఆదివారం వెలవెలబోయాయి. నిబంధనల ప్రకారం శని, ఆదివారాల్లో బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్వోలు) మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉండాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పాడేరులోని 318, అరకులోయలోని 306 పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీసం సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం.

సచివాలయాల బాట పట్టిన సిబ్బంది

పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు ఎవరూ రాకపోవడంతో, గ్రామాల వారీగా సచివాలయాల్లో బీఎల్వోలు, పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండి ఓటర్ల వివరాల డిజిటలైజేషన్‌ పనుల్లో నిమగ్నమయ్యారు. అరకులోయ మండలం చినలబుడు పంచాయతీలోని పోలింగ్‌ స్టేషన్లను మండల ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, బీఎల్వోలు పరిశీలించారు. కొంతమంది సిబ్బంది నేరుగాా గ్రామాల్లోని ఇళ్లకు వెళ్లి ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్‌ ఫారాలను సేకరించారు.

జోరు వాన.. ఓటర్ల నిరాసక్తత

జిల్లావ్యాప్తంగా ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఓటర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. వాతావరణం సహకరించకపోవడంతో ఓటరు నమోదు ప్రక్రియపై ఆసక్తి చూపలేదు. సచివాలయాలకు అతి తక్కువ మంది మాత్రమే వచ్చి దరఖాస్తులు సమర్పించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం వాతావరణం సహకరించకపోవడంతో ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement