బాధితుడి పక్షాన న్యాయ పోరాటం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

బాధితుడి పక్షాన న్యాయ పోరాటం చేస్తాం

Jul 6 2026 12:46 AM | Updated on Jul 6 2026 12:46 AM

7.30 గంటల తర్వాత సీసీ పుటేజ్‌ బయట పెట్టాలి

బాధితుడు నూకరాజు చెప్పిన విషయాలే నేను మాట్లాడా

మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌

నర్సీపట్నం: నర్సీపట్నం రూరల్‌ ఎస్‌ఐ రాజారావు పెట్టిన చిత్రహింసల్లో గాయపడిన మా పార్టీ నాయకులు, బాధితుడైన సుర్ల నూకరాజు పక్షాన న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ పేర్కొన్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పినట్టు నేను అసత్య ఆరోపణలు చేయలేదు, బాధితుడు చెప్పిన విషయాలనే మీడియాకు వెల్లడించానని గణేష్‌ తెలిపారు. డీఎస్పీ ఆహ్వానం మేరకు సీసీ పుటేజ్‌లు పరిశీలించేందుకు మాజీ ఎమ్మెల్యే ఆదివారం డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. డీఎస్పీ చూపించిన సీసీ పుటేజ్‌లను గణేష్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితుడు నూకరాజును 4.30 గంటలకు పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారన్నారు. ఎస్‌ఐ పెట్టిన చిత్రహింసలకు బాధితుడు లాకప్‌లో మొలతాడుతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడన్నారు. ఆ సమయంలో ఎస్‌ఐ, బాధితుడు మధ్య జరిగిన సంభాషణ ఆడియో సీసీ పుటేజ్‌ లేదన్నారు. 6.50 గంటల వరకు ఉన్న సీసీ పుటేజ్‌ను మాత్రమే చూపించారన్నారు. అదే రోజు బాధితుడిని రాత్రి 10 గంటల వరకు స్టేషన్‌లో ఉంచారన్నారు. 7.30 గంటల నుంచి 10 గంటల మధ్య సీసీ పుటేజ్‌ను బయట పెట్టాలని డీఎస్పీని కోరితే ఎస్పీ కార్యాలయంలో ఉందని సమాధానం ఇచ్చారన్నారు. దయచేసి 7.30 గంటల నుంచి 10 గంటల మధ్య సీసీ పుటేజ్‌లను బయట పెట్టి మా అనుమానాలను నివృత్తి చేయాలని డీఎస్పీని కోరాడం జరిగిందన్నారు. ఎస్‌ఐను వెనకేసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. సంఘటన 3వ తేదీన జరిగితే వారు చేసిన తప్పు కప్పించుకునేందుకు 4వ తేదీన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారన్నారు. ఆ రోజే ఎందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని గణేష్‌ ప్రశ్నించారు. తహసీల్దార్‌, వీఆర్వోలతో తప్పుడు ఫిర్యాదు చేయించి మా నాయకుడుపై తప్పుడు కేసు పెట్టారన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామని, అక్కడ కూడా న్యాయం జరగకపోతే నూకరాజుకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఆయన పార్టీ లీగల్‌సెల్‌ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర, మండల పార్టీ అధ్యక్షులు శానపతి వెంకటరత్నం, ఎంపీపీ బోళెం వెంకటేష్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement